Share News

Ration Vehicle: ఎందుకీ వాహన సేవ

ABN , Publish Date - Jun 08 , 2025 | 02:24 AM

‘మంచి ప్రభుత్వం’ అంటే ఏమిటి? లెక్కా పక్కా లేకుండా ప్రజాధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేసేయడమేనా? కోట్లు పంచిపెట్టి మరీ... తిట్టించుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరమా? రేషన్‌ సరుకుల పంపిణీ వాహనాల (ఎండీయూ) విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలివి!

Ration Vehicle: ఎందుకీ వాహన సేవ

  • ‘ఇంటింటికీ రేషన్‌’ విధానం రద్దు

  • వాహనాలు మాత్రం ఆపరేటర్లకు ఉచితం

  • బ్యాంకు రుణం ప్రభుత్వమే కట్టాలని నిర్ణయం

  • 530 కోట్లు అప్పు తెచ్చి వాహనాల కొనుగోలు

  • రూ.6 లక్షల్లో ఆపరేటర్‌ వాటా 60 వేలు మాత్రమే

  • మిగిలిన మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం

  • ఇంత చేసినా సంతృప్తి వ్యక్తం చేయని ఆపరేటర్లు

  • ఉచితంగా వాహనం వచ్చినా సర్కారుపై విమర్శలే

  • జగన్‌కు జై కొడుతూ రేషన్‌ వాహనాలతో ర్యాలీలు

ప్రజా ధనం రూపాయి ఖర్చుపెట్టినా దానికి ఒక అర్థం ఉండాలి! ఆ ఖర్చుకు ఒక ఫలితం దక్కాలి! పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాబట్టే... వేలకోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కష్టనష్టాలకు ఎదురొడ్డి తిండి గింజలు పండిస్తున్నారు కాబట్టే అన్నదాతలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆహార భద్రత కోసం వందలకోట్ల సబ్సిడీ భరించి మరీ రేషన్‌ సరుకులు అందిస్తున్నారు. మరి... ‘ఇంటింటికీ రేషన్‌ సరుకులు’ పేరిట గత జగన్‌ సర్కారు రుద్దిన వాహనాలతో లాభమేమిటి? ఈ విధానాన్ని రద్దు చేసిన నేటి ప్రభుత్వం... ఆ వాహనాలకు తీసుకున్న రుణాన్ని తానే చెల్లించడమేమిటి? వాటిని ఆపరేటర్లకు ‘ఫ్రీ’గా ఇచ్చేయడమేమిటి? ఇలా వందలకోట్లు ఖర్చు చేయడం వెనుక ప్రజా ప్రయోజనం ఉందా? పోనీ... కూటమి పార్టీలకు రాజకీయ ప్రయోజనమైనా దక్కుతుందా? లేదు... లేదు... లేదు!

కోట్లు ఇచ్చి తిట్టించుకోవడమే..

దాదాపు రూ.6 లక్షల విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చేయాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై... ఎండీయూ ఆపరేటర్లు సంతృప్తిగా ఉన్నారా? హర్షం వ్యక్తం చేశారా? ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారా? లేనే లేదు! పైగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ‘మాది వైసీపీ... మా నాయకుడు జగన్‌’ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటూ గగ్గోలుపెడుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. కొందరు ఆపరేటర్లు మరో అడుగు ముందుకు వేసి.. 4వ తేదీన వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో తమ వాహనాలతో సహా పాల్గొన్నారు. జగన్‌కు జై కొట్టారు. పలుచోట్ల వైసీపీ నేతలు ఎండీయూ ఆపరేటర్లను పిలిపించుకుని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపేలా వ్యూహాలు రచిస్తున్నారు. వెరసి... రాజకీయ ప్రయోజనం లేదు. ప్రజా ప్రయోజనం అసలే లేదు. మరి... ఎండీయూ వాహనాలను ఆపరేటర్లకే ఇవ్వడంలో ఔచిత్యమేమిటి?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మంచి ప్రభుత్వం’ అంటే ఏమిటి? లెక్కా పక్కా లేకుండా ప్రజాధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేసేయడమేనా? కోట్లు పంచిపెట్టి మరీ... తిట్టించుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరమా? రేషన్‌ సరుకుల పంపిణీ వాహనాల (ఎండీయూ) విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలివి! రాష్ట్రంలో మొత్తం 1.46 కోట్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా ఉచిత బియ్యం, ఇతర రేషన్‌ సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. దాదాపు 30 వేల చౌక ధరల దుకాణాల ద్వారా కొన్ని దశాబ్దాలుగా రేషన్‌ సరుకుల పంపిణీ సజావుగా సాగిపోతోంది. రేషన్‌ డీలర్లకు ఆయా సరుకులపై కమీషన్‌ మాత్రమే చెల్లించేవారు. ప్రభుత్వానికి ఒక్కో డీలరుపై నెలకు సగటున రూ.7 వేలకు మించి ఖర్చు వచ్చేది కాదు. అయితే... గత జగన్‌ ప్రభుత్వం ఎవరూ అడక్కపోయినా డోర్‌ డెలివరీ పేరుతో అనాలోచితంగా రేషన్‌ వాహనాలను తీసుకొచ్చింది. ఇదో పెద్ద ప్రహసనం, తతంగం! సుమారు రూ.539 కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి... 9260 ఎండీయూ వ్యాన్లు కొనుగోలు చేసింది. ఈ వాహనాలను లబ్ధిదారులకు అప్పగించింది. వీరిలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులేఅన్నది బహిరంగ రహస్యం. లబ్ధిదారుల నుంచి 10 శాతం వాటా తీసుకుని.. మిగిలిన 90 శాతం అప్పును ప్రభుత్వమే చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. అంటే... సుమారు రూ. 6 లక్షల విలువైన వాహనంలో రూ.60వేలు లబ్ధిదారుడు కట్టగా, మిగిలిన రూ.5.40 లక్షల రుణాన్ని ప్రభుత్వమే చెల్లించాలన్న మాట. ఆ వాహనాల ఈఎంఐల కింద సుమారు రూ. 247 కోట్లు, ఏటా సర్వీసు ఫీజు కింద రూ. 200 కోట్లు చెల్లిస్తూ, వాహనాల బీమా... దీనికి అదనంగా ప్రతినెలా ఎండీయూ ఆపరేటర్లకు రూ.21వేల జీతం! వెరసి... ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఎండీయూ వాహనాలకు ఇప్పటి వరకు రూ. 1,860 కోట్లు ఖర్చు చేసేశారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ చెల్లిస్తూనే... రేషన్‌ వాహనాలకు ఇంత భారీస్థాయిలో ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదో గుదిబండగా మారింది.


రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఇంత చేసినా పేదలకు రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ అవుతున్నాయా? అంటే అదీ లేదు. నెలలో 15 రోజులు మాత్రమే రేషన్‌ వాహనాలను రేషన్‌ సరుకుల పంపిణీకి వినియోగిస్తున్నారు. మిగిలిన రోజులన్నీ ఆ వాహనాలను ఆపరేటర్లే తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది ఎండీయూ ఆపరేటర్లు తమ వాహనాలను తిప్పడం మానేశారు. ఇంటింటికీ పంపిణీ ఒక మిథ్యగా మారింది. నెలలో ఒక రోజు... వీధి చివర్లో బండి నిలిపి, సైరన్‌ మోగిస్తే లబ్ధిదారులు బండి ముందు క్యూలో నిల్చుని సరుకులు తీసుకోవాలి. ఆ సమయానికి కార్డుదారుడు అందుబాటులో లేకుంటే అంతే సంగతులు. ఇక... గత ప్రభుత్వంలో రేషన్‌ మాఫియా వ్యవస్థీకృతమైపోయింది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇంటింటికీ తిరుగుతున్న ఎండీయూ ఆపరేటర్లే కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కిలో రూ.46కు పైగా ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా అందజేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారుల నుంచి కేవలం రూ.10 లకే తీసుకోవడం, చాలామందికి సరుకులు ఇవ్వకుండానే వెళ్లిపోవడం, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా ఎండీయూ వాహనాల్లోనే స్మగ్లర్ల అడ్డాలకు రేషన్‌ బియ్యాన్ని తరలించడం వంటి ఉదంతాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. బియ్యం అక్రమ రవాణాలో భాగస్వాములైన దాదాపు 300 మంది ఎండీయూ ఆపరేటర్లపై కేసులుకూడా నమోదయ్యాయి. ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టినతర్వాత రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీటన్నింటి నేపథ్యంలో... కూటమి ప్రభుత్వం ఈపద్ధతిని మార్చేసింది. ప్రతి నెలా 15 రోజుల్లో ఎప్పుడైనా,ఎక్కడైనా రేషన్‌ డీలర్‌ వద్ద సరుకులు తీసుకునే పాత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది బా గానే ఉంది! కానీ...ఎండీయూ వాహనాల మాటేమిటి?


ఊరికే ఇచ్చేస్తారా?

సాధారణంగా ప్రభుత్వం తమ అధికారుల కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటే... నెలవారీగా అద్దె, ఇతర ఖర్చులను చెల్లిస్తారు. అంతటితో అది పూర్తవుతుంది. అంతేగానీ ప్రభుత్వమే వాహనం కొనిచ్చి.. నెలనెలా వేతనాలు చెల్లించి.. ప్రభుత్వానికి చెందిన ఆ వాహనాన్ని మళ్లీ ఆపరేటర్‌కే అప్పగించడం ఎక్కడా ఉండదు. స్వయం ఉపాధి పథకాల కింద వాహనాలను లబ్ధిదారులకు ఇవ్వడం సహజం. కానీ... ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానం రద్దు చేసినప్పటికీ... వాటిని మాత్రం వాటి ఆపరేటర్లకే ‘ఫ్రీ’గా ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడమే విచిత్రం! ఒక్కో వాహనానికి ఆపరేటర్‌ భరించింది రూ.60 వేలు. మిగిలిన రూ.5.40 లక్షలు బ్యాంకు రుణం! ఆ మొత్తం ప్రభుత్వమే చెల్లించనుంది. అంతేకాదు... వాహనం కూడా ఆపరేటర్‌కే సొంతమవుతుంది. వెరసి... జగన్‌ సర్కారు ప్రవేశపెట్టిన ‘ఇంటింటికీ రేషన్‌’ విధానం మాత్రమే రద్దయింది. వాహనానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయమే అమలవుతోంది. తన భవిష్యత్తు అవసరాల కోసం రేషన్‌ వాహనాలను ఉపయోగించుకునే వ్యూహంలో భాగంగా జగన్‌ నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. కానీ... కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడవడం ఎందుకు? వాటిని ఆపరేటర్లకే ఉచితంగా ఇచ్చేయడంలో హేతుబద్ధత ఏమిటి? వాహనం కావాలంటే రుణం మీరే చెల్లించండి. వద్దనుకుంటే... వాహనం వెనక్కి ఇచ్చేయండి! అని ఎందుకు చెప్పడంలేదు?

Updated Date - Jun 08 , 2025 | 02:33 AM