Speaker Chintakayala Ayanna: విశాఖ భూములను కాపాడండి
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:05 AM
విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర
మాజీ సైనికుడి భూమికి ఎన్‌ఓసీ జారీపై విచారణ చేయించండి
రెవెన్యూ మంత్రికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాజీ సైనికులకు ఇచ్చినవి, అసైన్డ్ భూము (డీ-పట్టా)లు అన్యాక్రాంతం కాకుండా కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఆయన లేఖ రాశారు. విశాఖ కేంద్రంగా డీ పట్టా భూముల దందా భారీగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మాజీ సైనికులు, ఫ్రీహోల్డ్ అయిన అసైన్డ్ భూములను చేజిక్కించుకునేందుకు ప్రైవేటు ముఠాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిపై ‘ఆంధ్రజ్యోతి’ మే, జూన్ నెలల్లో వరస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన జనసేన నేత, కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ జూన్ 27న మీడియాతో మాట్లాడుతూ.. ఎండాడలోని మాజీ సైనికుల భూమితో పాటు ఇతర చోట్ల ఉన్న ఢీ పట్టా భూములు దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండాడ భూమి విషయంలో అక్రమంగా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్పీకర్ అయన్న ఉటంకిస్తూ... ఎండాడకు చెందిన మాజీ సైనికుల భూముల ఉదంతంపై విచారణ చేయాలని రెవెన్యూ మంత్రిని కోరారు. ‘‘మూర్తియాదవ్ ఎండాడలోని మాజీ సైనికుడి భూమి 5.10 ఎకరాలకి ఎన్‌ఓసీ గురించి లేవనెత్తారు. ఎన్‌ఓసీ తీసుకోవడంలో ప్రత్యేకించి నా సోదరుడు, మరికొందరు వైసీపీ నేతలు కలిసి పనిచేశారని అన్నారు. అందులో నా పేరును కూడా ప్రస్తావించారు. ఇది పూర్తిగా నిరాధారమైనది. ఈ అంశంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఆరోపణలు నా వ్యక్తిగత ప్రతిష్ఠకు, రాజకీయ జీవితానికి మచ్చతెచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని స్పీకర్ అయ్యన్న కోరారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే నివేదిక అందించాలని కోరారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి