Share News

Prakasam District : అప్పు ఎగ్గొట్టి.. మరింత దోచేయాలని!

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:32 AM

తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Prakasam District : అప్పు ఎగ్గొట్టి.. మరింత దోచేయాలని!

  • పోలీసు వేషంలో ముఠా యత్నం

  • రూ.3.5 కోట్ల డిమాండ్‌

  • పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి

  • సూత్రధారి సహా ఏడుగురు అరెస్టు

ఒంగోలు కైం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా ఏడుగురిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో నివసించే చలగర్ల శ్యామ్‌కుమార్‌ ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి వద్ద రూ.10లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ సొమ్ము ఆరు నెలల్లో తిరిగిస్తానని చెప్పాడు. ఇచ్చిన 10 నెలల గడువు ముగియడంతో శ్యామ్‌కుమార్‌పై డబ్బు కోసం బంగారం వ్యాపారి ఒత్తిడి తెచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా వ్యాపారి నుంచి డబ్బు గుంజేందుకు శ్యామ్‌కుమార్‌ పన్నాగం పన్నాడు. ఈ నెల 29న ఓ మహిళను పిలిపించి మంగమూరురోడ్డులోని ఓ ఇంట్లో ఉంచాడు. సాయం త్రం వస్తే మీ డబ్బు చెల్లిస్తానని వ్యాపారికి చెప్పాడు. అతడి ఇంటికి వచ్చిన వ్యాపారి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లొచ్చేసరికి పోలీసు డ్రెస్‌ వేసుకున్న నలుగురు అతడిపై దాడి చేశారు. దుస్తులు విప్పించి ఫొటోలు, వీడియోలు తీశారు. ఫేస్‌ పౌడర్‌ ప్యాకెట్లు అక్కడ పడేసి, ఇక్కడ డ్రగ్స్‌ దొరికాయని, అమ్మాయి కూడా ఉందని వ్యాపారిని భయపెట్టారు. అతని వద్ద ఉంగరం లాక్కున్నారు. ఆ నలుగురూ శ్యామ్‌కుమార్‌ను కూడా బెదిరించారు. మహిళతో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతామన్నారు.


ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.3.5 కోట్లు ఇవ్వాలని చెప్పి, సొమ్ము తీసుకురమ్మని వ్యాపారిని పంపారు. మరునాడు వ్యాపారి ఒంగోలు తాలుకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ముఠా పరారైంది. కేసు పెట్టిన తాలుకా సీఐ... ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి సంఘమిత్ర హాస్పిటల్‌ సమీప ప్లైఓవర్‌ వద్ద ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్యామ్‌కుమార్‌తోపాటు హైదరాబాద్‌ మణికొండకు చెందిన నిమ్మల విజయలక్ష్మి, లింగంపల్లికి చెందిన సందాపురం శ్రీశైలం, అంబర్‌పేట శ్రీలక్ష్మి, కొక్కరపాటి దుర్గాప్రసాద్‌, దోర్నాల వినోద్‌కుమార్‌, దోర్నాల శ్రీశైలంను అరెస్టు చేశారు. రాజు, సురేశ్‌ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 04:34 AM