Recruitment Updates : కానిస్టేబుల్ పోస్టులకు 39 వేల మందికి అర్హత
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:27 AM
6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతోన్న అభ్యర్థుల్లో 39 వేల మంది దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు.

పూర్తయిన దేహదారుఢ్య పరీక్షలు.. త్వరలో తుది రాత పరీక్ష..
కోర్టు తీర్పుమేరకు హోంగార్డులపై నిర్ణయం: పీఆర్‌బీ చైర్మన్ రవి ప్రకాశ్
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతోన్న అభ్యర్థుల్లో 39 వేల మంది దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 95 వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా 2024 డిసెంబరు 30 నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు ప్రారంభించింది. అవి గురువారం ముగిశాయి. నెల పాటు జరిగిన ఈ పరీక్షలకు 69 వేల మంది మాత్రమే హాజరయ్యారు. 2023 ఫిబ్రవరిలో 4.90 లక్షల మంది ప్రాథమిక రాత పరీక్ష రాశారు. అర్హత మార్కులు వచ్చిన 95 వేల మందిని దేహదారుఢ్య పరీక్షలకు పిలవకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. హోంగార్డుల కోటా విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పూర్తిగా వదిలేసింది. ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కూటమి పెద్దలకు విన్నవించడంతో ప్రక్రియ ప్రారంభమైంది. హోంగార్డు రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్లిన రెండున్నర వేల మంది న్యాయస్థానం అనుమతితో పీఈటీ, పీఎంటీ పరీక్షల్లో పాల్గొన్నారు. అర్హత సాధించిన 39 వేల మందికి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామని పీఆర్‌బీ చైౖర్మన్ ఎం.రవి ప్రకాశ్ తెలిపారు. కాకినాడ జేఎన్‌టీయూకు పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించామని, హోంగార్డుల రిజర్వేషన్‌పై కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కేసు వ్యవహారానికి సంబంధించి పీఆర్‌బీని కోర్టు అడిగిన వివరాలు త్వరలో అందజేయబోతున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News