Engineering Experts : డయాఫ్రం వాల్ పనులపై నిపుణుల సంతృప్తి
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:18 AM
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులను చేపడుతూనే.. నిధుల కోసం జల వనరుల శాఖ ఉరుకులు, పరుగులు పెడుతోంది.
2,700 కోట్ల నిధుల కోసం జల వనరుల శాఖ ఉరుకులు
ఢిల్లీ చేరిన పోలవరం సీఈ నరసింహమూర్తి
నేటి మధ్యాహ్నానికి డబ్బు విడుదలపై స్పష్టత!
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులను చేపడుతూనే.. నిధుల కోసం జల వనరుల శాఖ ఉరుకులు, పరుగులు పెడుతోంది. అమెరికా నిపుణులు డేవిడ్ బ్రియాన్ పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో ఈ నెల 1న ప్రాజెక్టు క్షేత్రానికి చేరుకున్నారు. వాల్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతికంగా తామిచ్చిన సూచనలకు అనుగుణంగా టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడకం దగ్గర నుంచి కాలమ్స్ వరకూ సవ్యంగా నిర్మిస్తున్నారో లేదో గమనించారు. నిర్మాణ పనులపై 95 శాతం వరకూ సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పనులపై సందేహాలు లేవనెత్తడంతో ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి కూలంకషంగా జవాబులు ఇవ్వనున్నారు. కాగా.. గ్యాప్-1లో మోటార్లతో నీటిని తోడేటప్పుడు నీటితోపాటు ఇసుక, మట్టి కూడా బురద రూపంలో పైకి వస్తున్నాయని.. దీనివల్ల మట్టి గట్టిదనం దెబ్బతిని నిర్మాణాలకు ముప్పు ఏర్పడవచ్చని నిపుణులు విశ్లేషించారు. ఇలా జరక్కుండా ‘బట్రెస్ డ్యాం’ విధానంలో మట్టి పటిష్ఠత కాపాడాలని సూచించారు. దీనిపై పోలవరం ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించారు.
ఇంకోవైపు.. గత ఏడాది కేటాయించిన నిధుల్లో విడుదల చేయాల్సిన రూ.2,700 కోట్లను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరేందుకు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2024-25లో రూ.5,500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిన ఆ శాఖ.. ఇప్పటివరకు రూ.2,800 కోట్లే ఇచ్చింది. ఇవి ఖర్చయ్యాక మిగిలిన రూ.2,700 కోట్లు ఇస్తామని చెప్పింది. ఆ నిధులు వ్యయమైనందున మిగతా సొమ్ము మంజూరు చేయాలని దేబర్షిని నరసింహమూర్తి కోరనున్నారు. జలశక్తి శాఖ కూడా సుముఖంగా ఉన్నందున .. మంగళవారం మధ్యాహ్నానికి నిధుల విడుదలపై స్పష్టత వస్తుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.