Heavy Rains: భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:54 AM
విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5. 04 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అమరావతి, ఆగస్టు 21: ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా.. రాష్ట్రంలోని నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గురువారం అమరావతిలో స్పందించారు. ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఇన్, ఔట్ ఫ్లూ 10.03 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. ఈ వరద నీటి ప్రవాహం కారణంగా.. అల్లూరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అలర్ట్ ప్రకటించినట్లు చెప్పారు. అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వైపు భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 50.8 అడుగులుగా ఉందని తెలిపారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, సఖినేటిపల్లి వద్ద గోదావరిలో వరద ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రేవుల మధ్య రాకపోకలను బంద్ చేశారు. ఎగువు నుంచి వశిష్ట గోదావరిలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేశారు. ఆ క్రమంలో అధికారులు అప్రమత్తమై.. గోదావరిలో చేపల వేట కోసం కట్టిన వలలు తొలగించారు.
ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరికి వరద పెరుగుతుంది. స్పిల్ వే వద్ద 32.630 మీటర్లు, అప్పర్ కాపర్ డ్యాం వద్ద 33.440 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్ వే నుంచి దిగువకు 9,91,282 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు.
అల్లూరి జిల్లాలో..
అల్లూరి జిల్లాలో సైతం గోదావరి నది ఉధృతంగా సాగుతోంది. ఈ కారణంగా.. విలీన మండలాల్లోని పలు రహదారులు, కాజ్ వేలు నీట మునిగాయి. ఇక శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో సోకు లేరు, చీకటి వాగులు పొంగుతున్నాయి. అలాగే చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో అనేక గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. చట్టి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిమ్మలగూడెం వద్ద జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో ఆంద్రా, ఒడిశాలకు వెళ్ళే వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది. కొండ్రాజు పేట వద్ద నీట మునిగిన చింతూరు, కూనవరం ప్రధాన రహదారి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది వరద ఉదృతితో కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్ వే నీట మునిగింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో లంక గ్రామస్తులు, స్థానికులు.. నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇక దొడ్డిపట్ల రేవును తాత్కాలికంగా అధికారులు నిలిపి వేశారు.
బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరుగులు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5. 04 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక, లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపానికి రాకపోకలను నిలిపివేశారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో జలాశయం 10 గేట్లను.. 18 అడుగులు మేర ఎత్తివేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ వద్ద ఇన్ ఫ్లో: 5, 00, 019 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 4, 25,121 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌లో పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. నదిలో ప్రస్తుతం 197.0114 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు..
శ్రావణ మాసం.. ఆఖరి శుక్రవారం..
AP More AP News And Telugu News