Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ మీద సానుకూలంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:48 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేసులో ఇవాళ విచారణ జరిగింది. పవన్ విన్నపానికి ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
ఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన వ్యక్తిగత హక్కులు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగింది. తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రం, గొంతు, ఇంకా వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా నిరోధించాలని పవన్ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు.
సోషల్ మీడియా వేదికలు, ఈ-కామర్స్ సైట్లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో తన ప్రతిష్టను దిగజార్చేలా లేదా తన అనుమతి లేకుండా తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కీలక రాజ్యాంగ పదవిలో ఉన్నందున, తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లడం వల్ల తన ప్రజా జీవితంపై ప్రభావం పడుతుందని పవన్ కళ్యాణ్ తన పిటిషన్ లో కోర్టుకు వివరించారు.
దీంతో.. 2021 ఐటీ నిబంధనల ప్రకారం, అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు సంబంధిత సంస్థలను ఆదేశించింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ, సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఆయన ఇమేజ్‌ను వాడుతున్న లింకులను తొలగించాలని కూడా కోర్టు సూచించినట్లు సమాచారం.
వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) అంటే ఏమిటి?
ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించి వారి పేరు, గొంతు, సంతకం లేదా ముఖచిత్రాన్ని వారి అనుమతి లేకుండా ఇతరులు వాణిజ్యపరంగా వాడుకోకుండా ఉండే హక్కునే 'పర్సనాలిటీ రైట్స్' అంటారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులు కూడా ఇటువంటి హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి