Deputy Pawan Kalyan: మరో 15 ఏళ్లు కూటమే
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:53 AM
రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తేల్చిచెప్పారు. మూడు పార్టీలూ కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. ‘సేనతో..సేనాని’ పేరిట జనసేన విశాఖపట్నంలో..
రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి
మూడు పార్టీలూ కలిసే ఉంటాయి: పవన్ కల్యాణ్
అనుమానమేమీ పెట్టుకోవద్దని జనసేన నేతలకు స్పష్టీకరణ
విశాఖలో ‘సేనతో సేనాని’ సమావేశాలకు హాజరు
సోషల్ మీడియాలో మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు,
దుష్ప్రచారం కట్టడికి చట్టం అవసరమని ఉద్ఘాటన
నేడు ప్రత్యేక ఆహ్వానితులతో భేటీ.. రేపు విస్తృత సమావేశం
3 పార్టీలూ కలిసే ఉంటాయి: పవన్
విశాఖలో ‘సేనతో సేనాని’ సమావేశాలు
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తేల్చిచెప్పారు. మూడు పార్టీలూ కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. ‘సేనతో..సేనాని’ పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. బీచ్‌రోడ్డులోని బే వ్యూ హోటల్‌లో ఉదయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం మిగిలిన నాయకులతోనూ భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీతో కలిసే జనసేన ముందుకు నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు, ఎక్కడ, ఏమి మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించాలని.. అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలని, దానిపై చట్టం తీసుకొచ్చేలా యత్నించాలని సూచించారు. ‘దీనిపై నిపుణులతో ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి, సూచనలు తీసుకుందాం. జనసేన సిద్ధాంతాల ఆధారంగా నిర్మితమైంది. ఆ భావజాలానికి ప్రజలు కనెక్ట్ అయ్యారు. పార్టీని ముందుకు నడిపించడంతో యువతదే కీలక పాత్ర. ఆ యువశక్తికి నాయకులు అండగా నిలవాలి’ అని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

త్వరలో కార్యకర్తల ఇంట్లో జనసేనాని బస: సుందరపు
పవన్ నిర్వహించిన లెజిస్లేచర్ సమావేశంలో చర్చించిన విషయాలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వివరించారు. సోషల్ మీడియాలో మహిళలపై పెడుతున్న పోస్టుల వల్ల ఎదురవుతున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రతపై మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు తీర్మానాలు ప్రతిపాదించగా.. ఆమోదించినట్లు తెలిపారు. భవిష్యత్‌లోతమ అధినేత జిల్లాల పర్యటనలు చేసినప్పుడు కార్యకర్తల ఇంట్లో బస చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, దానికి ఆయన అంగీకరించారని వెల్లడించారు. శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభకు 14,500 మంది ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించాం. మరో పది వేల మంది కూడా హాజరవుతారు. వారినుద్దేశించి పవన్ మాట్లాడతారు’ అని చెప్పారు. 30న నిర్వహించే సమావేశ ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్టు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ప్రీతి అనుమానాస్పద మృతిపై మొదట స్పందించి, అక్కడకు వెళ్లి 2లక్షల మందితో సమావేశం నిర్వహించింది తమ అధినేతేనని విజయకుమార్ చెప్పారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
విశాఖపై ప్రత్యేక అభిమానం
విశాఖపట్నం అంటే తనకు ప్రత్యేక అభిమానమని, గతంలో ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని వస్తే నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలుత విశాఖే వచ్చానని, అప్పుడు కూడా ఇక్కడి ప్రజలు అండగా నిలిచారని, అందుకే పార్టీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి ఏమి చేసినా పార్టీకి, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.
పార్టీ లైన్ దాటుతున్నారు!
కొందరు జనసేన ఎమ్మెల్యేలపై పవన్ గుర్రు
పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ హితవు పలికారు. వారి పనితీరుపై ఆయన ప్రత్యేకంగా సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. గురువారంనాటి సమావేశంలో వాటిని వారికి అందించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలను దాటి వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆక్షేపించారు. పనితీరు మార్చుకుని, ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని సూచించారు.
చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా?
సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారుచేశారని పవన్ తెలిపారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లుగా చేయూతనిచ్చినవారినే తిడితే ఎలాగని ప్రశ్నించారు. ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించానని గుర్తుచేశారు. తమ పోరాటాల ఫలితంగానే నాటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. చట్టప్రకారం సర్కారు నుంచి వారికి పరిహారాలు అందాయన్నారు. ఎకరా రూ.2కోట్ల విలువ చేసే ఐదెకరాలు, 5సెంట్ల ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.. ఇవన్నీ తమ ఒత్తిడి కారణంగానే అందాయని తెలిపారు. సీబీఐ దర్యాప్తు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం లాకర్‌లో పెట్టిందన్నారు. ఉపముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ, హోం మంత్రితో మాట్లాడి త్వరగా న్యాయంచేయాలని కోరినట్లు చెప్పారు. సీఐడీ విచారణలో అనుమానితుల డీఎన్‌ఏలు సరిపోలడం లేదని తెలిసిందని.. సాక్ష్యాలు కూడా తారుమారు చేశారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..