Share News

AP Sanitation Tenders: వన్‌సైడ్‌ చేసేద్దాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:42 AM

రాష్ట్రంలో శానిటేషన్‌ టెండర్లు మొత్తం కంపెనీల టర్నోవర్‌ ఆధారంగానే ఎంపిక అవుతాయి.

AP Sanitation Tenders: వన్‌సైడ్‌ చేసేద్దాం

ఆరోగ్య శాఖ శానిటేషన్‌ టెండర్లలో ఇష్టారాజ్యం

  • డాక్యుమెంట్‌ నిబంధనలకు పాతర

  • సొంత రూల్స్‌ అమలు చేస్తున్న ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు

  • అర్హత లేని కంపెనీలకు అందలం

  • వాటిపై ఫిర్యాదులున్నా లెక్కచేయరు

  • రూ.50 కోట్ల టర్నోవర్‌ కూడా లేని కంపెనీపై అవ్యాజ ప్రేమ

  • మూడేళ్ల జీఎస్టీ చూపించకున్నా ఓకే

  • 2 సార్లు బ్లాక్‌ లిస్ట్‌ అయిన సంస్థకు అండ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శానిటేషన్‌ టెండర్లు మొత్తం కంపెనీల టర్నోవర్‌ ఆధారంగానే ఎంపిక అవుతాయి. ఇదే జరిగితే రాష్ట్ర వైద్యసేవలు-మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎంఎ్‌సఐడీసీ) అధికారులు కోరుకునే సంస్థలకు టెండర్లు దక్కవు. ఎక్కువ టర్నోవర్‌ ఉన్న కంపెనీలను ఏవేవో కారణాలతో డిస్‌క్వాలిఫై చేస్తే.. తమకిష్టమైన కంపెనీలు తెరపైకి వస్తాయి. కేవలం ఇదే కారణంతో అన్ని అర్హతలున్న సంస్థలను పోటీ నుంచి తప్పిస్తున్నారు. మొన్న సెక్యూరిటీ టెండర్లలో జరిగిన విధంగా శానిటేషన్‌ టెండర్లకు ముందుగానే బేరసారాలు జరిగిపోయాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆరోగ్య శాఖలో కీలకమైన వ్యక్తికి సంబంధించిన టీమ్‌.. ఈ టెండర్లు ఏయే కంపెనీలకు ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించేసింది. అది ఇచ్చిన జాబితాను ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు గుడ్డిగా అనుసరిస్తున్నారు. అందు లో ఉన్న కంపెనీలనే ఎంపిక చేసి.. మిగిలినవాటిని టెక్నికల్‌ బిడ్‌ దశలోనే డిస్‌క్వాలిఫై చేసేశారు. ఇందుకోసం టెండర్‌ కమిటీలో కొన్ని మార్పులు చేశారు. గత వారం వరకూ టెండర్‌ వ్యవహారాలు చూసిన చీఫ్‌ ఇంజనీర్‌ను అకస్మాత్తుగా తప్పించి.. ఏపీఎంఎ్‌సఐడీసీలో కీలకమైన ఇద్దరు అధికారులకు ఆ బాధ్యత అప్పగించారు. వారిద్దరూ కీలక వ్యక్తికి చెందిన టీమ్‌ మార్గదర్శకత్వంలో నడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత వారం ఏయే కంపెనీలకు అర్హత కల్పించారో.. సోమవారం విడుదల చేసే పైనల్‌ లిస్ట్‌లో కూడా అవే కంపెనీలు ఉండనున్నాయి. డిస్‌క్వాలిఫై అయిన తమపై వచ్చిన అభ్యంతరాలను నిరూపించుకునేందుకు ఆయా కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. వాటిని అధికారులు కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే క్వాలిఫై అయిన కంపెనీలపై అనేక ఫిర్యాదులు వచ్చినా బుట్టదాఖలు చేస్తున్నారు. టెండర్‌ ప్రక్రియలో ఏదైనా కంపెనీపై ఫిర్యాదులు వస్తే.. వాటి నుంచి తప్పనిసరిగా వివరణ కోరాలి. అవి ఇచ్చిన వివరణ సక్రమంగా ఉందో లేదో అధికారులే చూసుకోవాలి. ఈ టెండర్ల విషయంలో ఇవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారు.

టర్నోవర్‌ లేని.. బ్లాక్‌లిస్ట్‌ కంపెనీలకు పెద్దపీట

శానిటేషన్‌ టెండర్‌ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఎంపిక చేసిన ఏడు కంపెనీల్లో కొన్నింటిపై అనేక ఫిర్యాదులున్నాయి. ప్రస్తుతం వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ)లో రాయలసీమ ప్రాంత ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు చేస్తున్న కంపెనీ ఏపీలో రెండు సార్లు బ్లాక్‌లిస్టయింది. సదరు కంపెనీ తిరుపతిలో సక్రమంగా పనులు చేయడం లేదని, శానిటేషన్‌ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదంటూ దానిని డీఎంఈ అధికారులు బ్లాక్‌లి్‌స్టలో పెట్టారు.


ఇదే కంపెనీ యాజమాన్యం మరో సంస్థ పేరుతో శానిటేషన్‌ టెండర్లల్లో పాల్గొంది. ఆ కంపెనీ కూడా ఈ ఏడాది మే నెలలో తెలంగాణలో బ్లాక్‌లిస్ట్‌ అయింది. మరోవైపు జీఎస్టీ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంతో భవిష్యత్‌లో ఈ కంపెనీ ఏపీలో ఎలాంటి టెండర్లలో పాల్గొనే వీల్లేకుండా చేయాలని జీఎస్టీ అధికారులు లేఖ రాశారు. కంపెనీలు వేరైనా యాజమాన్యం ఒక్కటే కాబట్టి జీఎస్టీ రాసిన లేఖ ఆధారంగా సదరు కంపెనీని డిస్‌క్వాలిఫై చేయాలి. కానీ అధికారులు మొట్టమొదట ఆ సంస్థనే క్వాలిఫై చేశారు. గతంలో సెకండరీ హెల్త్‌లో ఫేక్‌ డాక్యుమెంట్స్‌ చూపించి శానిటేషన్‌ పనులు దక్కించుకున్న కంపెనీకి.. మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు కీలక వ్యక్తికి సంబంధించిన టీమ్‌, అధికారులు తాపత్రయపడుతున్నారు. సదరు కంపెనీ యజమాని... ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు కూడా. ఇప్పటికే ఆ కంపెనీకి అర్హత లేకపోయినా సెక్యూరిటీ టెండర్లు కట్టబెట్టారు. ఇప్పుడు శానిటేషన్‌ టెండర్లు కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఆ కంపెనీకి సరైన టర్నోవర్‌ లేదు. పైగా టెండర్‌ నిబంధనల ప్రకారం మూడేళ్లు జీఎస్టీ, ఈఎ్‌సఐ, ఈపీఎ్‌ఫలకు సంబంధించిన డాక్యుమెంట్లు కచ్చితంగా బిడ్‌లో పొందుపరచాలి. కానీ ఆ కంపెనీ 3 నెలల డాక్యుమెంట్లు మాత్రమే పొందుపరిచింది. మరోవైపు సీఎం చంద్రబాబును మీడియాలో అనునిత్యం విమర్శించే మాజీ ఎంపీకి సంబంధించిన కంపెనీకి కూడా టెండర్లలో అర్హత కల్పించారు.

సీఎం అయితే లెక్కా..?

ప్రభుత్వాస్పత్రుల్లో పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. రోగులకు మంచి వాతావరణలో వైద్య సేవలు అందించాలని ప్రతి సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. శానిటేషన్‌ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని.. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు, టర్నోవర్‌ ఎక్కువ ఉన్న కంపెనీలకు శానిటేషన్‌ పనులు అప్పగించాలని చెబుతున్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు ఆయన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌ కంపెనీలు, అర్హత లేని కంపెనీలు, జగన్‌కు అనుకూలంగా ఉండే కంపెనీలతో పాటు గల్లీల్లో ఉండే కంపెనీలను సైతం ఎంపిక చేసే పనిలో పడ్డారు. టెండర్‌ ప్రక్రియలో పాదర్శకతకు పూర్తిగా పాతరేశారు. ముడుపులిచ్చిన కంపెనీలకు, ముందుగానే నిర్ణయించుకున్న కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. సోమవారం ఆగమేఘాల మీద టెక్నికల్‌ కమిటీ సమావేశంతో పాటు బిడ్‌ ఖరారు కమిటీ భేటీ కూడా నిర్వహించి.. తాము అనుకున్న కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప దీనికి బ్రేకులు పడే అవకాశం లేదు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:42 AM