Share News

Electricity Charges : కరెంట్‌ చార్జీల పెంపు లేదు

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:12 AM

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగ వ్యయం, ఆదాయం మధ్య రూ.12,632 కోట్లు తేడా ఉందని.. ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా...

Electricity Charges : కరెంట్‌ చార్జీల పెంపు లేదు

  • 12,632 కోట్ల సబ్సిడీకి ప్రభుత్వం ఓకే

  • అందుకే చార్జీలు పెంచడం లేదు

  • ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్‌ వెల్లడి

  • 3 డిస్కమ్‌ల రాబడి 44,323 కోట్లు

  • వ్యయం అంచనా రూ.57,544 కోట్లు

  • వ్యత్యాసాన్ని భరించేందుకు సర్కారు హామీ

  • కర్నూలులో 2025-26 టారిఫ్‌ విడుదల

  • తొలిసారి గంటల వారీగా విద్యుత్‌ కొనుగోలుకు కీలక నిర్ణయం

  • ఈవీలకు యూనిట్‌ ధర రూ.6.70

కర్నూలు/తిరుపతి/అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ ఠాకూర్‌ రామసింగ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగ వ్యయం, ఆదాయం మధ్య రూ.12,632 కోట్లు తేడా ఉందని.. ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించేందుకు ఆమోదం తెలిపినందున.. ప్రజలపై కరెంటు చార్జీల భారం మోపడం లేదని వెల్లడించారు. గురువారం కర్నూలు నగర శివారులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో కమిషన్‌ సభ్యుడు పి.వెంకట్రామరెడ్డితో కలిసి 2025-26 ఆర్థిక సంవత్సర విద్యుత్‌ చార్జీల టారి్‌ఫ ను ఆయన విడుదల చేశారు. విద్యుత్‌ చార్జీల అంశంపై ఇటీవల సేకరించిన ప్రజాభిప్రాయాన్ని అధ్యయనం చేశాక డిస్కమ్‌ల ఆదాయాలను, ఖర్చులను మదింపు చేశామని ఈ సందర్భంగా చెప్పారు. విద్యుత్‌ శాఖలోని ఏ విభాగంలోనూ చార్జీలు పెంచడం లేదన్నారు. డిస్కమ్‌లు ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌ వార్షిక వ్యయ అంచనాను రూ.58,868 కోట్లుగా ప్రతిపాదించగా.. కమిషన్‌ రూ.57,544.17 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ‘మూడు డిస్కమ్‌ల ద్వారా రూ.44,323 కోట్లు ఆదాయం వస్తుంది. వ్యయ అంచనాలు, రాబడికి మధ్య రూ.12,632 కోట్ల వ్యత్యాసం ఉంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబిడ్సీ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ వినియోగం, ఉద్యానవన నర్సరీలు, ఆక్వాకల్చర్‌ రైతులకు, దోబీలు, ఎస్సీ, ఎస్టీలు తదితరులకు రాష్ట్రప్రభుత్వ ఉచిత విద్యుత్‌/రాయితీలు కొనసాగుతాయి.


స్వల్పకాలిక విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రథమంగా గంటల వారీగా సమీక్ష చేపట్టే వీలు కల్పిస్తూ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రతి గంటకూ అవసరం మేరకు కరెంటు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. ఏపీ జెన్కో పూర్తి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, ఆయా డిస్కమ్‌లు ఇతర సంస్థలపై ఆధారపడడాన్ని తగ్గించడమే లక్ష్యంగా బొగ్గు సేకరణకు అనుమతి ఇచ్చాం. ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా లేదా పునర్నిర్మించుకునే ఇళ్లకు గతంలో మాదిరిగా కేటగిరీ-2 (వాణిజ్యం) కింద కాకుండా కేటగిరీ-1 (గృహ వినియోగం) కింద బిల్లు ఇస్తాం. తద్వారా వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. 150 కేవీ సామర్థ్యం కలిగిన ఈవీ చార్జింగ్‌ స్టేషన్లకు ఎల్‌టీ వోల్టేజ్‌ స్థాయి విద్యుత్‌ సరఫరా చేయడమే కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాలకు యూనిట్‌ చార్జింగ్‌ వసూలు ధరను రూ.6.70గా నిర్ణయించాం’ అని తెలిపారు. అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా గృహ వినియోగదారులు 50 శాతం డెవల్‌పమెంట్‌ (అభివృద్ధి) చార్జీలు మాత్రమే చెల్లించి అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. ఈ పథకం మార్చి 1 నుంచి జూన్‌ 30 వరకు ఉంటుందని, ఆన్‌లైన్‌ ద్వారా స్వచ్ఛందంగా అదనపు లోడ్‌ను ప్రకటించవచ్చని తెలిపారు. పథకం అమలు తీరుపై నెలనెలా పురోగతి నివేదికలను కమిషన్‌కు అందించాలని ఆదేశించారు. గ్రీన్‌ఎనర్జీ వినియోగంలో ప్రతి వినియోగదారుడినీ భాగస్వామిగా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వాస్తవానికి మార్చి 31లోపు టారిఫ్‌ విడుదల చేయాల్సి ఉన్నా.. ముందుగానే విడుదల చేస్తున్నట్లు ఇన్‌చార్జి చైర్మన్‌ తెలిపారు.

Updated Date - Feb 21 , 2025 | 03:12 AM