Smart Rice Cards: నేటి నుంచి కొత్త రైస్ కార్డులకు దరఖాస్తులు
ABN , Publish Date - May 07 , 2025 | 03:59 AM
నూతన రైస్ కార్డుల దరఖాస్తులకు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం. జూన్‌లో స్మార్ట్ రైస్ కార్డులు జారీకి సన్నాహాలు
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్వీకరణ
పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రైస్ కార్డుల జారీకి బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రైస్ కార్డుల జారీ, రైస్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, చిరునామాల మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, కార్డులు సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఐదేళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్లు నిండిన వృద్ధులు 6,45,765 మందికి ఈకేవైసీ నుంచి మినహాయించాం. ఇప్పటికే 3,94,08,070 మంది రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారు. నెల రోజులపాటు కొత్త రైస్ కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 94.4 శాతం మేర ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించాం. ఈనెల 12వ తేదీ తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.
జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేస్తాం. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈకార్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఈకేవైసీ పూర్తయిన వాళ్లు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక జూన్‌లో స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను కొరియర్ ద్వారా లబ్ధిదారుల చిరునామాలకు పంపిస్తాం. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రైస్ కార్డులు ఇచ్చే అంశం సీఎం చంద్రబాబు పరిశీలనలో ఉంది. అనాథాశ్రమాల్లో ఉండే వృద్ధులు సైతం రైస్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు’ అని మంత్రి తెలిపారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నానికల్లా పంట నష్టం పూర్తి వివరాలు అందుతాయన్నారు. దీపం-2 పథకం కింద నేటికి 1,50,19,303 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు.
50% సబ్సిడీతో టార్పాలిన్లు
భీమవరం టౌన్, మే 6(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్లను అందించనున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం తన శాఖకు సంబంధించిన పశ్చిమ, ఏలూరు జిల్లాల అధికారులు, రైస్ మిల్లర్లు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
PAN Card: పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
Security Mock Drill: హైదరాబాద్‌లోని ఆ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్.. ఎప్పుడంటే..
India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
Minister Satya Kumar: వైద్యులపై హెల్త్ మినిస్టర్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
CM Chandrababu: ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
For Andhrapradesh News And Telugu News