India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి
ABN , Publish Date - May 06 , 2025 | 03:30 PM
India - Pakistan war: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఏమిటి? ఆ ప్రభావం ఇరు దేశాల మీద.. మరి ముఖ్యంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‍లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‍ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే గెలుపు ఓటములు అనేవి తర్వాత సంగతి.. ముందుగా యుద్ధం చేయాలంటే భారీగా నిధులు కలిగి ఉండాలి. అది కూడా బిలియన్లు, ట్రిలియన్లలో నగదు ఉండాలి. మరి భారత్, పాకిస్థాన్ దేశాలకు అంత భారీగా నిధులు ఉన్నాయా? అదీకాక యుద్ధాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సైతం సంభవిస్తుంది. అలాగే భారీగా ఆయుధ సంపత్తి సైతం కలిగి ఉండి తీరాలన్నది సుస్పష్టం. అంతేకాదు.. ఈ యుద్ధం తర్వాత ఏ దేశమైనా మళ్లీ తిరిగి కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. అది కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే.
యుద్ధం ప్రారంభమే కాకూడదు..
ఇక యుద్ధం అనేది ప్రారంభమే కాకూడదు. ఓ వేళ ప్రారంభమైతే.. దానిని ఆపే శక్తి ఆ యుద్ధాన్ని ప్రారంభించిన ఆ దేశాల చేతుల్లో ఉండదన్న విషయం కూడా విధితమే. అందుకు గత చరిత్రలోనే కాదు.. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని పరిశీలిస్తే పరిస్థితులు ఇట్టే బోధపడతాయి. దాదాపు 1990లో ఓ సంస్థ సర్వే ప్రకారం పాకిస్థాన్ తో సుమారు 1000 గంటలపాటు భారత్ యుద్ధం చేస్తే.. అందుకు రూ. 27 వేల కోట్ల ఖర్చవుతుందని ఓ అంచనా. దాదాపు 4 దశాబ్దాల క్రితం జరిగిన తర్వాత ఈ సర్వేను పరిశీలిస్తే.. ప్రస్తుతం ఇదే సమయంలో పాక్ తో యుద్ధానికి దిగితే భారత్ కు అయ్యే ఖర్చు విలువ దాదాపు కొన్ని వందల రెట్లు పెరిగే అవకాశముంది. నాడు యుద్ధ ఖర్చు వేల కోట్లలో ఉంటే.. నేడు అది లక్షల కోట్లలోకి ఎగబాకిందన్నది సుస్పష్టం. అలాగే పాకిస్థాన్ కు సైతం దాదాపుగా ఇదే రీతిలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కానుంది.
ఆ రంగానికే భారీగా నిధులు..
అలాగే ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి భారీగా కేంద్రం నిధులు కేటాయిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. గతేడాది అంటే.. 2024-25 మధ్య రక్షణ రంగానికి రూ. 6.21 లక్షల కోట్లు కేటాయించింది. ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుదన్నది ఎవరు కాదనలేని సత్యం. ఇక భారత్ లో విదేశీ మారక నిల్వలు సైతం రూ.681.15 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇవి కూడా యుద్ధ అగ్ని గుండంలో సమిధి కాక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది.
ఒక వేళ యుద్ధం జరిగితే మాత్రం..
ఈ యుద్ధం కారణంగా రెండు దేశాల్లోని దాదాపు అన్ని రంగాలపై పన్నులు విధించే అవకాశముంది. ఇది సామాన్యుడిపై సైతం భారం పడే అవకాశముంది. ఇది ప్రపంచ మార్కెట్ లో భారత్ తయారు చేసే ఉత్పత్తులపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ లో జీఎస్టీ పేరిట ప్రతి దానిపై పన్ను పోటు తప్పడం లేదు. ఇక యుద్ధం జరిగితే మాత్రం పన్ను పోటు అలా ఇలా కాదు.. ఓ రేంజ్ లో ఉంటేందనే వాదన ఉంది. అలాగే సబ్సిడీ మీద ప్రభుత్వం పలు పథకాలను అందిస్తోంది. వీటికి సైతం దాదాపుగా కోత పడే అవకాశముంది. అలాగే రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధుతోపాటు ప్రపంచ బ్యాంకుల ముందు ఈ దేశాలు మోకరిల్లే పరిస్థితి ఏర్పడుతోంది.
వార్ ట్యాక్స్ అంటే..
యుద్ధం అంటేనే విపత్కర పరిస్థితుల్లో చోటు చేసుకుంటుంది. సాధారణ సమయంలో ప్రజలపై పన్నులను ప్రభుత్వం విధిస్తోంది. కానీ యుద్ధం జరిగితే మరిన్ని నిధులు ప్రభుత్వానికి అత్యవసరమవుతాయి. అలాంటి వేళ.. వార్ ట్యాక్స్‌ను ప్రభుత్వం విధిస్తుంది. అది కూడా ఎందుకంటే.. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. సైనికులు కోసం.. యుద్ధ సామాగ్రి కోసం, వారికి ఆహారం అందించడం కోసం, సైనికులను తరలించేందుకు తదితర అంశాలు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకు భారీగా నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వార్ ట్యాక్స్ విధించే అవకాశముంది.
ఇప్పటికే పరిస్థితి దారుణం..
ఇప్పటికే భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలూ పలు ఆంక్షలు విధించుకున్నాయి. అందులో భాగంగా ఇరు దేశాలు తమ గగనతలంలో ప్రత్యర్థి దేశాల విమాన రాకపోకలపై నిషేధం విధించుకున్నాయి. ఈ కారణంగా భారత్ నుంచి యూరప్, బ్రిటన్, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లే విమానాలు.. పాక్ గగన తలం నుంచి కాకుండా.. మరో మార్గం ద్వారా పయనిస్తున్నాయి. ఈ విధంగా నిషేధం విధించిన కొద్ది రోజులకే ఇరు దేశాల విమానయాన సంస్థలకు బిలియన్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయా విమానాల దూరాభారం పెరగడం, అధిక సమయం ప్రయాణించడంతోపాటు విమానయాన సంస్థలకు అదనపు సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉంది. తద్వారా ఏడాదికి రూ. 6 వందల మిలియన్ల మేర ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు.
ఒక్కటి కాదు.. అన్ని రంగాలకు దెబ్బే..
మరోవైపు గతంలో పాక్ తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఈ సింధు జలాలతోపాటు దాని ఉపనదుల నీటిని సైతం పాక్ లో పంటల సాగుకు వినియోగిస్తారు. ఈ నీరు ఆ దేశానికి వెళ్లక పోవడంతో.. ఆ దేశంలో పంట భూములు ఏడారిగా మారే అవకాశముంది. యుద్దం జరిగితే.. అది కాశ్మీర్ పర్యటకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాశ్మీర్ పర్యాటకంపై వేలాది కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి. అవి సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. దీంతో రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గనుంది. ఏదీ ఏమైనా యుద్ధం జరిగితే మాత్రం.. ఆ ప్రభావం ప్రజలపై పన్నుల రూపంలో నడ్డి విరచనున్నాయన్నది ఎవరి కాదనలేని సత్యం. ఎందుకంటే.. యద్దంలో గెలిచినా.. ఓడినా ఆ ప్రభావం ఆ దేశ ప్రజలపై ఏదో రూపంలో ప్రభావం చూపనున్నదన్నది సుస్పష్టం.
ఆ దిశగా భారత్ చర్యలు..
ఇక యుద్ధం ప్రారంభించడం కంటే.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం తాలుకా ఆర్థిక మూలాలపై వేటు పడేలా చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే ఆ దేశం తాలుకా ఉగ్ర వాద కోరలను పీకినట్లవుతోంది. ఆ దిశలోనే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే.. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ విమానాలను భారత్ గగనతలంలోకి రాకుండా అడ్డుకొంది. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిధులు సరఫరా ఆగిపోయేలా భారత్ అడుగులు వేస్తోంది.
For National News And Telugu News