Boutique Lady Scandal: పోలీసులను శాసించే బొటిక్ లేడీ.. మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా....?
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:44 PM
వైసీపీ ప్రభుత్వంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుని ఓ మహిళ.. ఆ ఐదేళ్లలో అత్యంత పవర్‌ఫుల్‌గా తయారయ్యారనే వార్తలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసుల అండతో.. తన కనుసైగలతో సెటిల్‌మెంట్లు, దందాలను నడిపించేదని తెలుస్తోంది.
నెల్లూరు: ఓ పాల వ్యాపారి లేదా ఓ పువ్వుల వ్యాపారి ప్రభుత్వాన్ని, పోలీసులను శాసించడం మనం సినిమాల్లో చూస్తుంటాం.. అదే రియల్ లైఫ్‌లో జరిగితే.. అలాంటి కథే నెల్లూరులో వెలుగు చూసింది. ఓ చిన్న బొటిక్ నిర్వహించుకునే మహిళ పోలీసులను, జిల్లా రాజకీయాలను శాసించింది. గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు, పోలీసుల అండదండలతో జిల్లాలో పవుర్ ఫుల్ మహిళగా ఎదిగింది. అప్పట్లో తను చేసిందే.. రైట్, చెప్పిందే వేదం అన్న తీరులో జిల్లాలో ఆమె కార్యకలాపాలు నడిపేది అంటే ఆమె ఎంత పవర్‌ఫుల్ లేడీనో మనం అర్థం చేసుకోవచ్చు.
బొటిక్ లేడీ టు డెన్ లేడీగా..
అయితే.. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారితో ఆమె సన్నిహిత సంబంధాలు పెంచుకుని ఆ ఐదేళ్లలో అత్యంత పవర్‌ఫుల్‌గా తయారయ్యారనే వార్తలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసుల అండతో.. తన కనుసైగలతో సెటిల్‌మెంట్లు, దందాలను నడిపించేవారు. డెన్లు ఏర్పాటు చేసుకుని రౌడీషీటర్లతో గ్యాంగ్‌లు కొనసాగించేవారు. అంతటితో ఆగకుండా గంజాయి స్మగ్లింగ్ చేయిస్తూ.. కోట్లు కూడబెట్టారు. ఆమె తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా బయట ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ ఈ దందాలు చేసేవారు. అయితే ఇదంతా.. వైసీపీ హయాంలో జరిగిన కథ.. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సదరు మహిళ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయినట్లు ఉన్నారు.. ఆమె జాడే లేకుండా పోయింది. అయితే తాజాగా.. మరోసారి ఆ సదరు మహిళ బయటకు వచ్చినట్లు సమాచారం.
రీఎంట్రీతో.. అలజడి..
జిల్లాలో ఆమె తాజాగా మళ్లీ సెటిల్‌మెంట్లు, దందాలు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అలజడితో ఆగిపోయిన సెటిల్‌మెంట్లు, దందాలు, గంజాయి రవాణాలు మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. అయితే.. ఓ హత్య కేసులో దోషిగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల పెరోల్ ఇప్పించటంలో ఆమె కీలకపాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైన్‌షాపు మేనేజర్‌ను హత్య చేసిన కేసులో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు జైల్లో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్.. 2018 నవంబరులో మళ్లీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. శ్రీకాంత్ బయటకొస్తే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశముందని.. అతనికి పెరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపారు. అయినా వాటిని బేఖాతరు చేస్తూ.. అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల కిందట హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమెకు ప్రభుత్వం దాసోహం..
కాగా, శ్రీకాంత్ జైలులో ఉన్నప్పుడు అతని గ్యాంగ్‌తో సదరు మహిళే దందాలు చేయించేది. శ్రీకాంత్ పెరోల్‌కు జిల్లాలో కొంతమంది నాయకులతోపాటు ఏపీ సచివాలయంలోనూ కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఆమె ఈ పెరోల్ మంజూరు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వివాదాస్పదమవటంతో ప్రభుత్వం పెరోల్‌ను రద్దు చేసింది. అయితే ఆ మహిళ ఇప్పటికీ ఏ స్థాయిలో అధికారులను, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆసుపత్రిలోనే ఖైదీతో సరసాలు.. కాపలాగా మారిన పోలీసులు
గతేడాది డిసెంబరులో అనారోగ్యం పాలయ్యారంటూ శ్రీకాంత్‌ను నెల్లూరు జిల్లా జైలు అధికారులు తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసు వాహనం దిగి, ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ద్విచక్రవాహనం వచ్చి ఢీకొనటంతో శ్రీకాంత్ చేయి విరిగింది. దీంతో మళ్లీ నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతణ్ని ఎవరూ కలవకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కానీ ఆ మహిళకు విధుల్లో ఉన్న పోలీసులు దాసోహమైపోయారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి కలిసేవారు. ఆసుపత్రిలోనే ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాడే వారంటే.. ఆమె నియంతృత్వం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవాలి..
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి