AP Pension: వారి కళ్లలో ఆనందమే మా సంతోషం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:05 PM
AP Pension: త్వరలోనే రైతులకు రూ.20 వేలు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకానుందన్నారు. తామిచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.

నెల్లూరు, జులై 1: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ (AP Pension) కొనసాగుతోంది. జిల్లాలోని మన్సూర్ నగర్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy), మంత్రి నారాయణ (Minister Narayana) ఇంటింటికీ వెళ్లి వృద్దులు, వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీ పెద్ద పండుగలా పింఛన్ల పంపిణీ సాగుతుందని తెలిపారు. ఏపీలో 67 లక్షల మంది కళ్లలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఏడాదికి రూ.34 వేల కోట్లు పింఛన్ల పంపిణీకి ఖర్చు చేస్తున్నామని.. త్వరలోనే రైతులకు రూ.20 వేలు అందిస్తామని వెల్లడించారు. అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకానుందన్నారు. తామిచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
పింఛన్ల పంపిణీలో చరిత్ర: ఎంపీ వేమిరెడ్డి
రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, క్రమం తప్పకుండా రూ.4 వేలు చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీలో చరిత్ర సృష్టించారన్నారు. వైసీపీ చెడు ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంత్రి నారాయణ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని.. ఆయన జిల్లా మంత్రిగా ఉండటం అందరి అదృష్టమని ఎంపీ వేమిరెడ్డి కొనియాడారు.
పింఛన్ల పంపిణీ అనంతరం నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్, వీఆర్ స్కూళ్లను ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ పరిశీలించారు. అలాగే వీఆర్ హైస్కూల్ పిల్లలకు కొద్దిసేపు పాఠాలు భోదించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..‘నేను ఋషీవ్యాలీ స్కూల్‌లో చదివా. అంతకంటే గొప్పగా వీఆర్ హైస్కూల్‌ను తీర్చిదిద్దారు. రూ.లక్షకి పైగా ఫీజులు చెల్లిస్తే కానీ అందని కార్పోరేట్ విద్యని పేద పిల్లలకు ఉచితంగా అందించడం సంతోషం. మూతపడ్డ స్కూల్‌ను అంతర్జాతీయ స్థాయి స్కూల్‌గా తీర్చిదిద్దడం సాధారణ విషయం కాదు. 1050 సీట్లు ఉంటే, 5 వేల దరఖాస్తులు వచ్చాయి. అవకాశం రానివారికి వచ్చే ఏడాది తప్పకుండా అవకాశం కల్పిస్తాం. మంత్రి నారాయణ చరిత్రలో నిలిచిపోతారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేశ్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఈ నెల 7న వీఆర్ హైస్కూల్‌ను లోకేష్ ప్రారంభించనున్నారు’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్‌కు రిలీఫ్
సీఎం హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News