Share News

Anam Ramanarayana Reddy: హిందూ ధర్మం, సనాతన ఆచారాలకు లోటు జరిగితే సహించం: మంత్రి ఆనం

ABN , Publish Date - Dec 31 , 2025 | 02:32 PM

ద్రాక్షారామంలో జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

Anam Ramanarayana Reddy: హిందూ ధర్మం, సనాతన ఆచారాలకు లోటు జరిగితే సహించం: మంత్రి ఆనం
Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు, డిసెంబర్ 31: కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని బీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ద్వారా హైందవుల మనోభావాలు దెబ్బదీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. సీసీ కెమెరా ఆధారంగా దోషులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవి చంద్ర, స్థానిక లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి తనని గుర్తు పట్టకుండా.. ముఖాన్ని దాచుకొని వచ్చినట్టు నిర్దారణకు అధికారులు వచ్చారన్నారు. ఆలయంలో వ్యక్తిపై ఉన్న కోపాన్ని ఇలా విధంగా చూపినట్టు గుర్తించారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శివలింగన్ని ఏర్పాటు చేసి పూజలు జరిపించారని వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.


ఇక నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవుడి అలంకరణ కోసం వినియోగించే వస్తువులు నకిలీ వెండి వస్తువులని తేలిందన్నారు. వెండి ఆభరణాలు.. ఎలా నకిలీ వస్తువులుగా మారాయనే దానిపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఎండోమెంట్ అధికారులకు ఆదేశించామని గుర్తు చేశారు.


సింహాచలం శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రసాదం తయారీ కౌంటర్లో తప్పు చేసిన వ్యక్తిపై చర్యలకు ఇప్పటికే ఆదేశించామని వివరించారు. ప్రసాదంపై భక్తుల ఆరోపణలకి స్పందించాల్సిన అధికారి.. వారిపై దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. హిందూ ధర్మం, సనాతన ఆచారాలకు లోటు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆయన హెచ్చరించారు.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది వైష్ణవ ఆలయాలను 5.5 లక్షల మంది భక్తులు దర్శించుకుంటే... ఈ ఏడాది 7.5 లక్షల మంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారని గణాంకాలతో సహా వివరించారు. ప్రజల్లో ఆధ్యాత్మికంపై నమ్మకం పెరుగుతుంది. ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. తిరుమలలో మంగళవారం ఆన్ లైన్ ద్వారా అవకాశం పొందిన 75 వేల మంది ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారన్నారు.


రామరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలన్నింటిని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పునరుద్ఘాంటించారు. రాష్టంలో అభివృద్ధి, సంక్షేమం.. రెండు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నారు. ప్రజలకి రూ. వేల కోట్లు అనేక పధకాలు ద్వారా పంపిణీ చేశామన్నారు.


ఏఎస్ పేటలో అభివృద్ధి జాతర జరుగుతోందని ఎంపీ వీపీఆర్ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జాడే కనిపించలేదని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేశారని వివరించారు. ఆర్థికలోటు ఉన్నప్పటికీ ఇతర రాష్ర్టాలతో పోటీ పడి అభివృద్ధి చేస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవి చంద్ర తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ దుష్ప్రచారం సాగిస్తుందని వైసీపీపై మండిపడ్డారు.

Updated Date - Dec 31 , 2025 | 02:35 PM