Share News

Excise Department : వాయిదాల ‘నవోదయం 2.0’

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:58 AM

తాజాగా ఒంగోలులో నవోదయం-2.0 ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు కూడా ఇది వాయిదా పడింది.

Excise Department : వాయిదాల ‘నవోదయం 2.0’

  • నాటుసారా నిర్మూలన ధ్యేయం

  • ఆ దిశగా కార్యక్రమం రూపకల్పన

  • నాలుగుసార్లు ప్రారంభం వాయిదా

  • రాష్ట్రంలో భారీగా పట్టుబడుతున్న సారా

  • 8 నెలల్లో 50 వేల లీటర్లు స్వాధీనం

అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాటుసారా నిర్మూలన, ప్రజల్లో అవగాహన కోసం రూపొందించిన ‘నవోదయం 2.0’ కార్యక్రమం ప్రారంభం వాయిదాల పర్వంగా సాగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు నాలుగుసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అనివార్య కారణాలతో నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఒంగోలులో నవోదయం-2.0 ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు కూడా ఇది వాయిదా పడింది. దీంతో అసలు నవోదయం ఇప్పట్లో ప్రారంభమవుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి నవోదయం-2.0 కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగకు ముందే ప్రారంభించాలనుకున్నారు. కానీ, పండుగ నేపథ్యంలో సిబ్బందిని సమీకరించడం కష్టమవుతుందని భావించి.. జనవరి 29న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఆ రోజు కూడా వాయిదా పడి.. 31వ తేదీకి మారింది. అయితే.. అప్పుడు కూడా వివిధ కారణాలతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15(శనివారం) ప్రారంభించాలని తేదీ ఖరారు చేశారు. కానీ, ఒంగోలులో సీఎం చంద్రబాబు వేరే కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో మళ్లీ వాయిదా వేశారు. 19న ప్రారంభించాలని తాజాగా కసరత్తు చేస్తున్నారు. అయితే, కీలక కార్యక్రమం ప్రారంభోత్సవం ఇన్నిసార్లు వాయిదా పడటంపై విమర్శలు వస్తున్నాయి. గత 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నాటుసారా నిర్మూలనకు నవోదయం కార్యక్రమాన్ని అమలుచేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నాటుసారా భారీగా పెరిగింది. ఇప్పటికీ ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నవోదయంకార్యక్రమానికి కొనసాగింపుగా ఈసారి నవోదయం 2.0ను రూపొందించారు. కానీ, రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కకుండా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇన్ని వాయిదాలపై ఎక్సైజ్‌ సిబ్బందిలోనూ అసహనం వ్యక్తమవుతోంది.


జగన్‌ హయాంలో..

గత జగన్‌ ప్రభుత్వంలో నాటుసారా స్థావరాలు జోరుగా విస్తరించాయి. అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలో నాటుసారా విక్రయాలపై 6,701 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 3,009 మందిని నిందితులుగా చేర్చారు. 51,143 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అదేసమయంలో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 25,93,542 లీటర్ల బెల్లం ఊటను, 17,499 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 222 వాహనాలను సీజ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 17 , 2025 | 04:03 AM