Share News

CM Chandrababu: భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్రమోదీనే: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:59 PM

దేశానికి నాలుగోసారీ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఒక సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని..

CM Chandrababu: భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్రమోదీనే: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, సెప్టెంబర్ 12: భారతదేశానికి నాలుగోసారీ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆయన అన్నారు. ఒక సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


వచ్చే దశాబ్ద కాలంలో ఏపీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనే అంశాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. '1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నా. 1999లో గెలిచా. 1999 ప్రభుత్వం వచ్చాక ఓ తపనతో పని చేశా. కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నాం. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు అందిస్తున్నాం. భారత ప్రధానిగా నాలుగోసారి కూడా మోదీనే వస్తారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు' అని చంద్రబాబు తేల్చి చెప్పారు.


ఏపీలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అని సీఎం చంద్రబాబు అన్నారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు.. దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలని ఆయన సూచించారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్లను సిద్ధం చేశామని తెలిపారు. '20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్ స్టాపబుల్ గా మారింది. 2038 నాటికి భారతదేశం నెంబర్-1 అవుతుంది. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నా' అని చంద్రబాబు వెల్లడించారు.


ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపిన చంద్రబాబు.. ఈ సంవత్సరం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగామని చెప్పారు. '2028-29 నాటికి రూ.29,29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధించగలం.. 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు ఉన్నాయి. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది' అని చంద్రబాబు స్పష్టం చేశారు.


2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5,42,985కి సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. '2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000కి సాధించగలం. ఇదేమీ అసాధ్యం కాదు.. నిర్దిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. మెగా డ్రీమ్స్ ఉండాలి.. సంకల్పం ఉండాలి.. అప్పుడు సాధ్యమే' అని చంద్రబాబు అన్నారు. విజన్-2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదని చంద్రబాబు అన్నారు.' భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. 'సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం.. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు ముఖ్యమే కానీ.. సమాజం గురించి కూడా ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు' అని చంద్రబాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 06:48 PM