Modi Government: రాష్ట్రానికి కేంద్రం వరాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:52 AM
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతి హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవే, తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌తో పాటు కీలక ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది.

రాజధాని, రైల్వే ప్రాజెక్టులపై మోదీ సర్కారు కీలక నిర్ణయం
అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు పచ్చజెండా
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
వెనుకబడిన జిల్లాలకు త్వరలో 350 కోట్లు
మరో పెట్రోలియం రిఫైనరీకి సన్నాహాలు
విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు
కీలక ప్రాజెక్టుల సత్వర పూర్తికి నిర్ణయం
న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పలు పెండింగ్ అంశాలతోపాటు.. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి-తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోం శాఖ పచ్చ జెండా ఊపింది. అలాగే, తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. మొత్తం 104 కిలో మీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఇక, ‘అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే’ను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు అనుమతులు జారీ చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.
ఏపీకి ప్రత్యేకం!
ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్టణం-విజయవాడ-హైదరాబాద్-కర్నూలు రైలు కారిడార్ ఏర్పాటు అంశాన్ని త్వరగా పరిశీలించాలని రైల్వే శాఖను హోంశాఖ కోరింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా సాగించాలని, రెండేళ్లలో అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా.. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎ్‌సఎ్‌ఫసీ) విభజన, విభజన చట్టంలోని షెడ్యూలు 9లో పేర్కొన్న కార్పొరేషన్లు, కంపెనీలు, షెడ్యూలు 10లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులపైనా కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీపై కూడా కేంద్ర హోంశాఖ చర్చించింది. అయితే, వీటిపై అటార్నీ జనరల్(ఏజీ) అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇక, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు మరో రూ.350 కోట్లను గ్రాంట్ రూపంలో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
తెలంగాణకు..
హైదరాబాద్-మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన అపరిష్కృత అంశాలు పరిష్కారం అయ్యాయని అధికారులు గత సమావేశంలో వివరించారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ ఏడాది డిసెంబర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించామని ఆ శాఖ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన నిధులపై నీతి ఆయోగ్‌తో చర్చించాలని హోంశాఖ అధికారులకు సూచించింది. ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని తేలినందున ప్రైవేట్ సంస్థలతో కలిసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం అలైన్‌మెంట్ పూర్తయిందని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుదిదశలో ఉందని తెలిపింది. మరో 4 నెలల్లో డీపీఆర్ పూర్తవుతుందని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది.
రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన సంస్థ!
ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేంద్రం ఇప్పటికే రూ.135 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా పూసాలో ఉన్న వ్యవసాయ పరిశోధనా సంస్థ దక్షిణాది క్యాంప్‌సను రాష్ట్రంలో నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని తాజాగా నిర్ణయించింది. అలాగే, రెండేళ్లలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అప్పటి వరకు తాత్కాలిక కార్యకలాపాలను నిర్వహించాలని రైల్వే బోర్డుకు హోం శాఖ సూచించింది.
ఉమ్మడి సమస్యలపై..
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వివిధ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ప్రాజక్టుల పురోగతిపై సమీక్షించింది. ప్రతి రెండు నెలలకోసారి సమావేశమై విభజనకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధుల పంపిణీ విషయంలో పరిష్కారం కనుగొనేందుకు ‘కాగ్’కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఉమ్మడి సంస్థల నిర్వహణపై తెలంగాణ చేసిన ఖర్చు తిరిగి చెల్లించే విషయం కూడా కాగ్‌కు నివేదించనున్నారు. కాగా, తదుపరి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, విద్యాసంస్థల ఏర్పాటు, ఏపీలో గ్రేహౌండ్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు.
Read Latest AP News And Telugu News