Rains: అకాల వర్షం.. అపార నష్టం.. ఆ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ..
ABN , Publish Date - May 04 , 2025 | 06:34 PM
ఏపీలోని పలు జిల్లాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. అలాగే పిడుగుపాటు కారణంగా కొందరు మృత్యువాతపడ్డారు. మరోవైపు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అమరావతి: ఏపీలోని పలు జిల్లాలను అకాల వర్షాలు ముంచెత్తాయి. అలాగే పిడుగుపాటు కారణంగా కొందరు మృత్యువాతపడ్డారు. మరోవైపు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోనంకి కూర్మనాథ్‌తో హోం మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితిపై ఆరాతీశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
కాకినాడ పరిధిలో..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. పట్లలపై నిల్వ చేరిన వర్షపు నీటిని రైతులు తోడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని కాట్రావులపల్లి రైతులు ఆందోళనకు దిగారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి మండలాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. ఓజిలి మండలం గొల్లపాలెం వద్ద పిడుగుపాటుకు కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు. అలాగే వద్ది గుంటకండ్రిక వద్ద ఆనాల భాస్కర్ (50) పిడుగుపాటు కారణంగా మృతి చెందాడు.

మండవల్లి మండలంలో..
ఏలూరు జిల్లా మండవల్లి మండలం దయ్యం పాడు గ్రామంలో పిడుగుపాటు కారణంగా సైదు గిరిబాబు (33)మృతి చెందారు. గిరిబాబు తన రొయ్యల చేపల చెరువుపై మేతల కడుతుండగా సడన్‌గా ఉరుము, మెరుపులతో వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ శబ్ధంతో పిడుగు పడడడంతో గిరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అలాగే ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో ఈదురుగాలుల దాటికి ఇంటిపై భారీ వృక్షం కూలింది. ఈ ఘటనలో ఇంట్లో పడుకుని ఉన్న బాలుడు మృతి చెందాడు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు..
అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పారు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచిస్తున్నారు.

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోనంకి కూర్మనాథ్‌తో హోం మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితిపై ఆరాతీశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయక చర్యలు అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని మంత్రి అనిత ఆదేశించారు.