AP News: ఒక్క నిర్ణయం.. ఎందరికో జీవితం..
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:52 AM
ఈడీ చేశారు. డీఎస్సీ కోసం ఆరేళ్లకుపైగా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించాలన్న నిర్ణయం.. ఉమ్మడి జిల్లాలోని 1403 మంది జీవితాల్లో వెలుగునింపింది.
- నూతన ఉపాధ్యాయుల్లో వెల్లివిరిసిన ఆనందం
తిరుపతి: బీఈడీ చేశారు. డీఎస్సీ(DSC) కోసం ఆరేళ్లకుపైగా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ(Mega DSC) నిర్వహించాలన్న నిర్ణయం.. ఉమ్మడి జిల్లాలోని 1403 మంది జీవితాల్లో వెలుగునింపింది. వీరిలో 1394 మంది పోస్టింగ్ ఆర్డర్లు పొందారు. సోమవారం బడుల్లో చేరారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
నా తల్లిదండ్రుల కాయకష్టానికి ఫలితం..
మాది పేద దళిత కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలో రెండో అమ్మాయిని. నా తల్లిదండ్రులు పద్దమ్మ, గున్నయ్య కూలి పనులుచేస్తూ చదివించారు. పేదరికం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మెగా అవకాశాన్ని వదులుకోకూడదని కష్టపడ్డా. డీఎస్సీలో 76.57 మార్కులు సాధించి సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యా. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుదువగడ్డ ప్రాథమిక పాఠశాలలో చేరా. ప్రభుత్వం కల్పించిన అవకాశం.. మా తల్లిదండ్రుల కాయకష్టానికి ఫలితం ఈ ఉద్యోగం.
- టి.భవాని, కమ్మకొత్తూరు, శ్రీకాళహస్తి మండలం
తల్లిదండ్రులకే అంకితం..
మా తల్లిదండ్రులు జానకమ్మ, రాధాకృష్ణ వ్యవసాయంతో జీవనం సాగించేవారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు. మెగా డీఎస్సీలో అర్హత పొందిన నేను ఎస్జీటీలో జిల్లాలో 24వ ర్యాంకు, ఎస్‌ఏ సోషల్ 67వ ర్యాంకు, టీజీటీ సోషల్ 77వ ర్యాంకు, టీజీటీ తెలుగులో 31వ ర్యాంకు సాధించా. నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చేరా. ఎన్ని ఇబ్బందులున్నా నాకు ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ఈ ఉద్యోగాన్ని అంకితం చేస్తున్నా.
- నల్లపాటి శివకుమార్, గోవిందప్పనాయుడు కండ్రిగ, బీఎన్‌కండ్రిగ మండలం
అత్యంత ఆనందం..
మాది పేద దళిత కుటుంబం. బీకామ్, బీఈడీ చేశా. నా తల్లిదండ్రులు బొగ్గల ఆదెయ్య, వేమక్కకు పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్నా. మెగా డీఎస్సీ ప్రకటనతో కోచింగ్ లేకుండానే కష్టపడి సన్నద్ధమయ్యా. రాయలసీమ జోన్ పరిధిలో 67.1028 మార్కులతో టీజీటీ సోషల్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యా. రేణిగుంట మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విధుల్లో చేరా. అన్ని వృత్తుల్లోకి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి లభించడం నా ఆనందం.
- ప్రతాప్, ఎన్టీఆర్ నగర్, బుచ్చినాయుడు కండ్రిగ మండలం
మెగా డీఎస్సీ జీవితాన్నిచ్చింది..
మాది నిరుపేద దళిత కుటుంబం. మెగా డీఎస్సీలో 75.46 మార్కులతో సాధించి సెకండరీగ్రేడ్ టీచర్‌గా ఎంపికయ్యా. శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరా. చిన్న వయసులోనే తండ్రి వీరయ్యను కోల్పోయా. కష్టపడి నన్ను చదివించిన తల్లి మెరుం వాణి కూడా ఏడాది కిందట చనిపోయింది. మెగా డీఎస్సీ నాకు జీవితాన్నిచ్చింది.
- లావణ్య, చిన్నసింగమాల, తొట్టంబేడు మండలం
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
మాన్న ఫిజికల్ డైరెక్టర్ మస్తానయ్య. తల్లి కళావతి. గత డీఎస్సీలో ఉద్యోగం సాధించలేకపోయాను. మెగా డీఎస్సీ ప్రకటించగానే ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. మెగా డీఎస్సీలో 83.03 మార్కులు సాధించి సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం సాధించా. బుచ్చినాయుడు కండ్రిగ మండలం తలారివెట్టు ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరా. మా నాన్నను ప్రేరణగా తీసుకుని ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి నా ఆనందానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
- పవన్‌కుమార్, కాంపాళెం, బీఎన్ కండ్రిగ మండలం
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News