Maha Kumbh 2025: మహాకుంభమేళా తొక్కిసలాటపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:05 PM
Maha Kumbh 2025: మహాకుంభమేళాలో జరిగిన విషాద ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అమరావతి/హైదరాబాద్, జనవరి 29: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాల కోల్పోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన విషాద తొక్కిసలాట పట్ల ఏపీ సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. మహాకుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం కోల్పోకుండా వారికి ఓదార్పు కల్పించాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్టు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడినవారికి సరైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే..
ప్రధాని, రాహుల్ సంతాపం..
అలాగే మహా కుంభమేళాలో జరిగిన అపశృతిపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని నేతలు కోరారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ గాంధీ అభ్యర్థించారు. మరోవైపు మహా కుంభమేళా జరిగిన పరిస్థితిని యూపీ సీఎం యోగి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహా కుంభమేళా వార్ రూమ్ చీఫ్ సెక్రటరీ డీజీపీ, హోంశాఖ అధికారులతో సీఎం యోగి చర్చించారు. మౌని అమావాస్యనాడు త్రివేణి జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు భారీగా వస్తున్నారు. కుంభమేళా ప్రారంభం నుంచి నిన్న ఉదయం వరకు 19.94 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
కాగా.. కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 12 మందికిపైగా మృత్యువాతపడ్డారు. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఇవి కూడా చదవండి...
Tirupati: తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు.
ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం
Read Latest AP News And Telangana News And Telugu News