TDP Working President: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
ABN , Publish Date - May 26 , 2025 | 03:18 AM
టీడీపీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కడప మహానాడులో ఈ ప్రతిపాదనపై తీర్మానం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ బాధ్యత అప్పగించాలని అధిష్ఠానంపై శ్రేణుల ఒత్తిడి
ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన చంద్రబాబు
క్షణం తీరిక లేకుండా కార్యక్రమాలు
2019లో ఇలాగే దెబ్బతిన్నాం
గత తప్పులు పునరావృతం కాకూడదు
పార్టీపై గట్టి పర్యవేక్షణ ఉండాల్సిందే
లోకేశ్‌కు బాధ్యత ఇస్తే టీడీపీ బలోపేతం
మినీ మహానాడుల్లో విస్తృత చర్చ
సీనియర్ నేతలదీ అదే మాట
మహానాడులో చర్చించి నిర్ణయం?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్ ప్రెసిడెంట్)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో ఆయనకు కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించి నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్షణం తీరికలేకుండా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్వహణ ఎంత ముఖ్యమో.. పార్టీ నిర్వహణా అంతే ముఖ్యం. ఒకప్పుడు చంద్రబాబు ఈ రెండింటినీ ఒంటిచేత్తో నిర్వహించేవారు. రాష్ట్ర విభజన జరిగి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంల్లో తలమునకలైపోయారు. ఇటు రాజధాని అమరావతి, అటు పోలవరం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి కీలక పనుల్లో మునిగిపోయారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. అచ్చం ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సన్నిహితులు పదే పదే చెప్పినా.. ఆయన సమయాన్ని కేటాయించలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో పార్టీకి అనూహ్యమైన దెబ్బతగిలింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్లుగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేవారు.
కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. జగన్ హయాంలో శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఆయన నడుం బిగించారు. దేశ విదేశాల నుంచి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల రూపకల్పనలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. తరచూ ఢిల్లీ వెళ్లాల్సి రావడం, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పన, అమలు, పీ-4 సిద్ధాంతంపై చర్చోపచర్చలు, క్వాంటమ్ వ్యాలీ రూపకల్పన.. ఇలా ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతుండటంతో ఆయన వివిధ శాఖలపై సమీక్షలు కూడా తగ్గించి అచ్చంగా వీటిపైనే దృష్టి పెట్టారు. దీంతో పార్టీకి, ఆయనకు మధ్య మళ్లీ దూరం పెరుగుతోంది. అధికారంలోకి వచ్చామన్న ఒక భరోసాతో కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే వాళ్లూ లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ మీద దృష్టి పెట్టకపోతే 2014-2019 అనుభవాలు పునరావృతమవుతాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే మహా యజ్ఞమే అవుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు కలిపి నిర్వహించడం అసాధ్యమవుతున్నందున టీడీపీ కేడర్ నుంచి సరికొత్త ప్రతిపాదన వస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్. కడప మహానాడుకు సన్నాహకంగా జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచీ ఇదే రకమైన డిమాండ్ వినిపిస్తోంది.
అలా చేస్తే తిరుగుండదు!
మొత్తంగా పార్టీ వ్యవహారాలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నప్పటికీ.. క్రియాశీల వ్యవహారాలన్నీ లోకేశ్‌కు అప్పగిస్తే పార్టీ పటిష్ఠంగా ఉంటుందని.. వైసీపీ నేతల అరాచకాలను సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకోవచ్చని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. లోకేశ్ కూడా గత కొంతకాలంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించి పార్టీపై మరింత దృష్టి సారిస్తే.. భవిష్యత్‌లో తెలుగుదేశానికి తిరుగుండదంటూ అన్ని మినీ మహానాడుల్లోనూ ప్రతిపాదించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం ఆయనకే సాధ్యమవుతుందని.. నాయకత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కడపలో మూడ్రోజులపాటు జరిగే మహానాడు ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.