Share News

Police Case On YCP Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం.. 27 మందిపై పోలీసులు కేసు నమోదు

ABN , Publish Date - Oct 31 , 2025 | 07:46 PM

కర్నూలు బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్న 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో వైసీపీ నేత ఆరే శ్యామల ఉన్నారు. ఆ జాబితాలో సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతోపాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు సైతం ఉన్నారు.

Police Case On YCP Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం.. 27 మందిపై పోలీసులు కేసు నమోదు

కర్నూలు, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు అందడంతో కర్నూలు తాలుకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జాబితాలో ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతోపాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు.


ఈ కర్నూలు బస్సు ప్రమాదం బెల్టు షాపులు, కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు.


ఈ ప్రమాదానికి మద్యం తాగిన బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి కారణమని తేల్చారు. అదే బైక్‌పై ప్రయాణించిన అతడి స్నేహితుడు ఎర్రి స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాను కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందన్నాడు. తనను డోన్‌లో దింపుతానని శివశంకర్ చెప్పాడంతో అతడి బైక్ ఎక్కానన్నాడు.


అనంతరం ఇద్దరం మద్యం తాగి.. శివశంకర్ తనను బైక్‌‌పై డోన్‌లో దింపేందుకు బయలుదేరాడని తెలిపాడు. అలా వెళ్తున్న క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టిందని.. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనలో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతలో రహదారిపై ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీశానని చెప్పుకొచ్చాడు. రహదారిపై ఉన్న బైక్‌ను తీసే క్రమంలో పలు బస్సులు వేగంగా వెళ్లాయని పోలీసులకు చెప్పాడు. అంతలో కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఈ బైక్‌ను ఈడ్చుకుని ముందుకు వెళ్లిందని.. ఆ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుకు ఎర్రి స్వామి వివరించాడు.


అయితే పెట్రోల్ బంక్‌లో శివశంకర్ తన బైక్‌కు ఆయిల్ కొట్టించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అయితే బెల్ట్ షాపులో విక్రయించిన కల్తీ మద్యం వీరు తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ఒక విధమైన ప్రచారానికి తెర తీసింది. దీంతో వెనుములయ్య పోలీసులను ఆశ్రయించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ..

కార్తీకంలో ఏకాదశి.. మహావిష్ణువుకు పూజలు ఎందుకంటే.. ?

For More AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 07:59 PM