Kurnool District : కర్నూలుకు బెంచ్
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:51 AM
మొత్తం 15మంది హైకోర్టు న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, అడ్వకేట్లకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యం...

వేగంగా పడుతున్న అడుగులు
భవనాల పరిశీలన చకచకా
ప్రాధాన్యాలవారీగా జాబితా తయారీ
అత్యవసరంగా నివేదిక పంపాలన్న హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలతో కదలిక
తాత్కాలిక భవనాలు, శాశ్వత నిర్మాణాలకు భూమి కోసం వేట
త్వరలోనే వివరాలు హైకోర్టుకు నివేదన
‘మూడు’ ముక్కలాటతో జగన్ మోసం
కూటమి రాగానే బెంచ్‌పై తీర్మానం
ప్రక్రియ ప్రారంభానికి హైకోర్టుకు సూచన
కర్నూలు, అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 15మంది హైకోర్టు న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, అడ్వకేట్లకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యం, ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) వి.శ్రీనివాస శివరాం ఈ నెల 29 లేఖ రాశారు. ఆ వివరాలతో నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగళం సభలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే గత నవంబరులో అసెంబ్లీలో తీర్మానం చేశారు. బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు మొదలుపెట్టాలని కోరుతూ, హైకోర్టుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటుకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఉంచేందుకు ఆ నివేదికను అత్యవసరంగా పంపాలని ఆదేశించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాయలసీమలో రాజధాని లేక హైకోర్టును పెట్టాలని మూడు ప్రాంతాల నాయకులు నాడు అంగీకరించారు. అప్పటినుంచీ కర్నూలుకు హైకోర్టును ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
భవనాల వేట..
కర్నూలులో హైకోర్టుబెంచ్ ఏర్పాటుచేస్తే దాదాపు 15 మంది న్యాయమూర్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కర్నూలు నగరంలో భవనాల వేటను గురువారం సాగించారు. కలెక్టరు ఆదేశాలతో కర్నూలు ఆర్డీవో, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు, కార్పొరేషన్ అధికారులు సహా ఇతర అధికారులు పలు భవనాలు పరిశీలించారు. సదుపాయాల కల్పన కోసం ఖాళీ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆర్‌డీవోకు స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యంగా బీ క్యాంప్‌లో క్లస్టర్ వర్సిటీ నిధులతో నిర్మించిన 62 గదులు కలిగిన జీ+2 భవనం; రెండో ప్రాధాన్యంగా దిన్నెదేవరపాడులో నిర్మించిన విద్యుత్ నియంత్రణ మండలి భవనం, మూడో ప్రాధాన్యంగా కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి నన్నూరు టోల్‌ప్లాజా దగ్గర 35వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన జీ+3 ప్రైవేటు భవనాన్ని గుర్తించారు. వీటిలో టోల్‌ప్లాజా వద్ద ఉన్న భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇప్పటికే ఓ బ్యాంకు అద్దెకు ఉంది. విద్యుత్ నియంత్రణమండలి భవనం ఈఆర్‌సీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఖాళీగా ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం తక్షణమే తాత్కాలికంగా బెంచ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అంటున్నారు. అలాగే భవిషత్తులో శాశ్వత భవనాల నిర్మాణాల కోసం జగన్నాథగట్టుపై 26 ఎకరాలు, జొహరాపురం సమీపంలో 20 ఎకరాల నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డు ఖాళీ స్థలంలో అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని అంటున్నారు.
ప్రక్రియ మొదలైందిలా..
2014లో రాష్ట్ర విభజన తరువాత శ్రీబాగ్ ఒడంబడిక అమలు అంశం తిరిగి తెరపైకి వచ్చింది. అమరావతిని రాజధానిగా చేయడంతో.. కర్నూలులో హైకోర్టు పెట్టాలని న్యాయవాదులు, విద్యార్థులు ఉద్యమాలు చేశారు. 2019 ఎన్నికల ముందు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని నాటి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం 3రాజధానుల పేరిట సీమ ప్రజలను ఐదేళ్లపాటు మభ్యపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ నేపధ్యంలో కర్నూలులో బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం ఫుల్ కోర్ట్ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి గత అక్టోబరు 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. దీనిపై సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కమిటీ ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈ కమిటీలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News