Share News

Vijayawada Metro: విజయవాడ మెట్రో ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు.?

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:01 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అంతకంతకూ వెనక్కు వెళ్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ) అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోగా.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకపోవడంతో పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది. ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తై టెక్నికల్ బిడ్‌లు తెరిచినా.. ఫైనాన్షియల్ బిడ్‌లను తెరిచి టెండర్లను ఖరారు చేయటానికి కేంద్రం అనుమతులు అవసరం. కానీ, అనుమతుల్లో జాప్యం కారణంగా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Vijayawada Metro: విజయవాడ మెట్రో ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు.?
Vijayawada Metro Project

విజయవాడ, నవంబర్ 28: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం రుణ ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. మెట్రోను వేగంగా పరుగులు పెట్టించటానికి వీలుగా టెండర్ల ప్రక్రియ మొదలుకుని నిధుల సమీకరణ వరకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ఇప్పటికిప్పుడు అనుమతులు ఇస్తే టెండర్ల ఖరారు మొదలు, రుణం లభించటం, పనులకు సిద్ధం కావడం వంటివి సమాంతరంగా జరిగేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే.. కేంద్రం అనుమతుల విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ)కు ఏం చేయాలో తెలియట్లేదు. గతంలో కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాక రెండేళ్ల పాటు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేసింది. చివరికి నూతన మెట్రో పాలసీని ప్రవేశపెట్టి అనుమతులు ఇవ్వలేదు. నూతన మెట్రో పాలసీ వచ్చాక మళ్లీ ఇప్పటికి విజయవాడ మెట్రో పట్టాలెక్కనుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావటంలో జాప్యం జరగడం ఇబ్బందిగా మారింది.


జనాభా సమస్య లేనేలేదు..

విజయవాడకు మెట్రో ప్రాజెక్టును ఇస్తామని కేంద్రం విభజన హామీ చట్టంలో పేర్కొంది. ఇంత జనాభా ఉండాలి.. అంత జనాభా ఉండాలి.. అని ఎక్కడా నిర్దేశించకుండా ఇచ్చిన హామీని అమలు చేయటంలో నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం జనాభాతో కూడా సమస్య లేదు. ఐదేళ్ల జాప్యంలో విజయవాడ అర్బన్ జనాభా బాగా పెరిగింది. విజయవాడ మెట్రోలో భాగంగా నిర్మించే కారిడార్-1 గన్నవరం నుంచి ఎన్హెచ్-16 మీదుగా రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్, పీఎన్బీఎస్ వరకు ఉంది. కారిడార్-2 పెనమలూరు సెంటర్ నుంచి బందరు రోడ్డు మీదుగా పీఎన్బీఎస్ వరకు ఉంది. ఈ రెండు మెట్రో కారిడార్లు గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న గ్రామాల నుంచి మొదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ జనాభా పెరగడంతో ఇప్పుడు సమస్యే లేకుండా పోయింది. విజయవాడ ట్రాఫిక్‌పై కొద్దికాలం కిందట కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మెట్రో ప్రాజెక్టు అవసరానికి తగినట్టుగానే ఈ సర్వే సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అనుమతులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియని పరిస్థితి.


ఎంపీలు స్పందించాలి..

విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని చిన్ని. వల్లభనేని బాలశౌరిలు కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురాకపోతే ఈ ప్రాజెక్టు కూడా లూప్లాన్లో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే విజయవాడ మెట్రో ప్రాజెక్టు కారిడార్-1లో అంతర్భాగమైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు సంబంధించి మోర్త్ ఆసక్తిగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మెట్రో జాప్యంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.


ఇవీ చదవండి:

కూలుతున్న భవిష్యత్‌ తరం!

గేమ్‌చేంజర్‌ ఎస్‌ 400

Updated Date - Nov 28 , 2025 | 11:05 AM