Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్‌కు గిన్నిస్ రికార్డ్...
ABN , Publish Date - Oct 02 , 2025 | 07:48 PM
విజయవాడ ఉత్సవ్‌లో కార్నివాల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
విజయవాడ: విజయవాడ ఉత్సవ్-2025 అరుదైన ఘనత సాధించింది. ఉత్సవ్‌లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన కార్నివాల్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు సర్టిఫికెట్ అందుకున్నారు. కార్నివాల్‌లో చేపట్టిన భారీ డప్పు ర్యాలీ ఈ రికార్డు సృష్టించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత ఆయన విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివాల్‌ను ప్రారంభించారు. అనంతరం అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కార్యక్రమంలో గంటకు పైగా కూర్చుని 40 కళా బృందాల ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డు సాధించినందుకు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ఈ కార్నివాల్‌లో 3 వేల మంది కళాకారులతో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు కళాకారులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ఊరేగింపు రథం నిలిచింది. ఈ కార్నివాల్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు..
అమరావతికి మణిహారంగా విజయవాడ ఉత్సవ్ ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మైసూరులో దసరా ఉత్సవాల తరహాలో ప్రతి యేడాది విజయవాడ ఉత్సవ్ ఉంటుందని ప్రకటించారు. సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ్‌కు కర్త, కర్మ, క్రియ సీఎం చంద్రబాబే అని ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం కారణంగా హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు తమ వెన్నంటి ఉంటూ.. నిత్యం ప్రోత్సహిస్తూ ఉన్నారని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఉత్సవ్ ప్రజల ఆదరణతో ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
ఇవాళ (గురువారం) ఉత్సవ్‌లో భాగంగా 280 ఈవెంట్లు ఐదు ప్రాంతాలలో జరుగుతున్నాయని కేశినేని శివనాథ్ చెప్పారు. మన సంప్రదాయ నృత్యాలతో వచ్చిన కళాకారులను గౌరవించుకున్నామని పేర్కొన్నారు. వచ్చే యేడాది మరింత ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని వివరించారు. ఈ ఉత్సవాలు చేస్తున్న వైబ్రెంట్ ఫర్ సొసైటీ సభ్యులకు, విజయవాడ వాసులకు కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..