Vijayawada: కొండ ప్రాంతవాసులకు వర్షాకాలంలో తప్పని తిప్పలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:31 AM
విజయవాడ ఇంద్రకీలాద్రి, గుణదల కొండ, గాంధీ కొండ వంటి భారీ కొండ సాణువులు సైతం రాతి, మట్టి కలబోతతో కూడి ఉంటాయి. ఇలాంటి కొండలు జనావాసాలకు సురక్షిత ప్రాంతాలు కావు. దీంతో భారీ వర్షాల సమయంలోనూ, ముసురుపట్టినప్పుడు, కొండలపై మట్టి నాని రాళ్లు బయట పడుతున్నాయి..
విజయవాడ: ముసురుకున్న వాతావరణంతో నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు. ఇటీవల వరుసగా వర్షాలు పడటంతో కొండలు నానాయి. తాజాగా ముసురు పట్టడంతో మరింతగా నానుతున్నాయి. ఇటీవల ప్రైజర్ పేట కొండపై రిటెయినింగ్ వాల్ విరిగిపడింది. ముసురు వాతావరణం, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నగర జనాభాలో 30శాతం మంది కొండపైనే జీవిస్తున్నారు. ముసురు పట్టినా, నాలుగైదు రోజులు వర్షాలు కురిసినా కొండ ప్రాంతాలు వణికి పోవాల్సిందే. ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించటానికి రిటెయినింగ్ వాల్స్ మాత్రమే పరిష్కారం. ఈ దిశగా అధికార యంత్రాంగాలు ఎప్పుడు కదులుతాయో తెలియని పరిస్థితి.
ఇతర ప్రాంతాల తరహాలో విజయవాడ కొండలుండవు. ఇంద్రకీలాద్రి, గుణదల కొండ, గాంధీ కొండ వంటి భారీ కొండ సాణువులు సైతం రాతి, మట్టి కలబోతతో కూడి ఉంటాయి. ఇలాంటి కొండలు జనావాసాలకు సురక్షిత ప్రాంతాలు కావు. దీంతో భారీ వర్షాల సమయంలోనూ, ముసురుపట్టినప్పుడు, కొండలపై మట్టి నాని రాళ్లు బయట పడుతున్నాయి.. ఇవి జనావాసాలపైకి దొర్లటం, రిటైనింగ్ వాల్ కూలడం వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొగల్రాజపురం కొండప్రాంతం, గుణదల, చిట్టినగర్, కొత్త పేట, గొల్లపాలెంగట్టు, సొరంగం, టైనర్ పేట, లంబాడి పేట, రామరాజ్యనగర్ ప్రాంతాల్లో సుమారు 30వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా కూలీనాలీ చేసుకునే పేద, మధ్యతరగతివారు.
దశాబ్దాల కిందట నగరానికి వలస వచ్చి కొండలపైనే నివాసం ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. గొల్లపాలెం గట్టు, సొరంగం, భీమన్నవారిపేట ప్రాంతంలో జారి పడిన కొండరాళ్లు గతంలో సంభవించిన ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్ కొండ ప్రాంతలో గతేడాది ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతిచెందారు. గతంలో లంబాడీపేట ప్రాంతంలో గోడకూలి నలుగురు మృతిచెందారు. అప్పటి నుంచి కొండ ప్రాంతాల్లో నివాసితులకు వర్షాకాలం వచ్చిందంటే కంటిపై కునుకు ఉండదు. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో ప్రమాదస్థాయిలో ఉన్న ఇళ్లను గుర్తించి చర్యలు చేపటేందుకు గతంలో నగరపాలక సంస్థ, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించారు.
ప్రమాదపుటంచున 960 నివాసాలు
కార్పొరేషన్, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వేలో నగర వ్యాప్తంగా సుమారు 860 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నట్టు గుర్తించారు. సర్వే నిర్వహించి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. కొండరాళ్లు పడి ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులను పరామర్శించి అంతో ఇంతో ఆర్థికసాయం చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప రిటైనింగ్ వాల్ నిర్మించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్నచోట యుద్ధ ప్రాతిది కన రిటైనింగ్ వాల్ నిర్మించి తమను కాపాడాలని వారు కోరుతున్నారు.
కొండదిగిరాలేమంటున్న ప్రజలు
వర్షాలు కురిసినప్పుడు ప్రమాదభరితంగా ఉన్న కొండప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వీఎంసీ అధికారులు ప్రచారం చేస్తున్నా అక్కడున్న ప్రజలు మాత్రం వెళ్లటంలేదు. దీంతో కొన్నిచోట్ల ప్రమాదం జరిగిన సందర్భాల్లో అధికారులు ఏం చేయలేని పరిస్థితి. రిటైనింగ్ వాల్ నిర్మించలేని కొండ ప్రాంత ప్రజలకు వీఎంసీ జేఎన్ఎన్ఏయూఆర్ఎం ఇళ్లు కేటాయించి తరలిపోవాలని చెబుతున్నా పట్టించుకోవడంలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ నుంచి అమెరికాకు 7 రెట్లు పెరిగిన ఎగుమతులు
అడవుల్లో పేలిన ఐఈడీ.. జవాన్ మృతి
For More National News And Telugu News