US India trade: భారత్ నుంచి అమెరికాకు 7 రెట్లు పెరిగిన ఎగుమతులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:32 AM
ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికల నేపథ్యంలో.. భారతీయ ఎగుమతిదారులు ఫ్రంట్‌లోడింగ్ పెంచారు ఫ్రంట్‌లోడింగ్ అంటే..
ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలే కారణం
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికల నేపథ్యంలో.. భారతీయ ఎగుమతిదారులు ‘ఫ్రంట్‌లోడింగ్’ పెంచారు! ఫ్రంట్‌లోడింగ్ అంటే.. సుంకాలు పెరుగుతాయని తెలిసినప్పుడు ముందే పెద్ద ఎత్తున ఎగుమతులను పెంచడం. ఎంతగా పెంచారంటే.. ఏప్రిల్-జూలై నెలల మధ్య అమెరికాకు మన ఎగుమతులు ఏకంగా 21 శాతం పెరిగి 33.5 బిలియన్ డాలర్లకు (రూ.2.92 లక్షల కోట్లకు) చేరింది. ఇదే సమయంలో.. భారత్ నుంచి మొత్తం ఎగుమతులు కేవలం 3 శాతం మాత్రమే పెరిగి 149.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.13 లక్షల కోట్లకు) చేరాయి. అంటే.. మనదేశం నుంచి పెరిగిన మొత్తం ఎగుమతులతో (3ు) పోలిస్తే.. అమెరికాకు (21ు) ఏడు రెట్లు ఎక్కువ పెరిగాయని గణాంకాలను ఉటంకిస్తూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం... ఎగుమతులను భారీగా పెంచేయడం వల్ల.. కొనుగోలుదారులకు కొంతమేర రాయితీ ఇచ్చే అవకాశం పెరుగుతుంది. తద్వారా.. ఆగస్టు 27 నుంచి సుంకాలు 50 శాతానికి చేరినా, ఇప్పుడు ఇచ్చే రాయితీని కలుపుకొంటే అప్పుడు కొనుగోలుదారులు అమెరికన్ వినియోగదారులకు కొంత తక్కువ ధరకే ఆ ఉత్పత్తులను విక్రయించే అవకాశం కలుగుతుంది. అందుకే మన ఎగుమతిదారులు ఎక్స్‌పోర్ట్స్‌ను భారీగా పెంచారు. తమ వ్యాపారాన్ని కోల్పోకుండా ఉండేందుకు.. పాత కొనుగోలుదారులకు అదనపు రాయితీలు కూడా ఇవ్వజూపుతున్నారు. ప్రస్తుతానికి పెంచిన (25%) సుంకాల దెబ్బ పూర్తిస్థాయిలో తమపై పడకుండా ఎగుమతిదారులు తీసుకుంటున్న ఈ చర్యలు తాత్కాలికమేనని.. సుంకాల భారం 50 శాతానికి పెరిగితే వారి వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. కాగా, ఏప్రిల్-జూలై నడుమ ఎగుమతులతో పోలిస్తే.. ఒక్క జూలై నెలలో భారత్ నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు.. జెమ్స్ అండ్ జువెలరీ రంగంలో ఎగుమతులు జూలైలో 28ు మేర పెరిగాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు.. ఏప్రిల్-జూలై నడుమ 7.4ు పెరిగితే, ఒక్క జూలైలోనే 14ు మేర పెరిగాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఏప్రిల్-జూలై నడుమ 6ు పెరిగితే.. ఒక్క జూలైలోనే 13.8ు పెరిగాయి. ప్లాస్టిక్ ఉత్పత్తుల ఎగుమతులు జూలైలో 4.4ు మేర పెరిగాయి.