Share News

Mahanadu 2025: మహానాడు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే

ABN , Publish Date - May 14 , 2025 | 03:30 PM

Mahanadu 2025: టీడీపీ మహానాడు తేదీలు ఖరారయ్యాయి. మహానాడు నిర్వహణపై మంత్రి లోకేష్ ఆధ్వరంలో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహానాడు‌ను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా చర్చించారు.

Mahanadu 2025: మహానాడు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే
Mahanadu 2025

అమరావతి, మే 14: మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నారు. ఈరోజు (బుధవారం) పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి నారా లోకేష్ (Minister) ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం జరిగింది. తెలుగు దేశం పార్టీ మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా మహానాడును నిర్వహించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందును ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది.


ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకను మూడు రోజులు నిర్వహించాలా వద్దా అనే అంశంపై కొంత మేర చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు యుద్ధం లేకపోవడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో మహానాడు జరుగనుంది. 27న పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై చర్చ జరుగనుంది. 28న ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 29న మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రులు, పార్టీ ప్రతినిధుల భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.


మహానాడు విజయవంతం కోసం మొత్తం 6 నిర్వహణ కమిటీలను మంత్రి లోకేష్ నియమించారు. ప్రతీ కమిటీలో ఆ జిల్లాకు సంబంధించిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, అనగాని, డోలా బాలవీరాంజనేయ స్వామి, రామానాయుడు, ఫరూక్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే పొలిట్ బ్యూరోలో మహానాడు ఏర్పాట్లపై లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.


ఇవి కూడా చదవండి

DD Next Level Movie: డీడీ నెక్ట్స్‌ లెవల్ హీరో, నిర్మాతకు లీగల్ నోటీసులు

Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2025 | 03:41 PM