Supreme Court: లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు
ABN , Publish Date - May 16 , 2025 | 01:02 PM
Supreme Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam)లో నిందితులకు సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. నిందితులు కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy)లకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు నిరాకరించింది (Rejected). దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో వారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్
కాగా వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈకేసులో కర్ణాటకలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంది. మద్యం ముడుపులను షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలెస్‌కు ఆయన డబ్బులు తరలించారనేందుకు ఆధారాలు సేకరించింది. ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఈ నెల 9వ తేదీన ఇచ్చిన నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కాకుండా బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన సిట్ కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించి మైసూరులోని ఓ రిసార్టులో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మద్యం స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను ఏ33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. రాజ్ కసిరెడ్డి(ఏ 1) నుంచి బాలాజీ గోవిందప్ప వరకూ ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు అరెస్టయ్యారు.
Also Read: హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త: పోలీసులు
తాడేపల్లి ప్యాలె్‌సకు రూ.3,200 కోట్ల మద్యం ముడుపులు..
గత ప్రభుత్వంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.3,200 కోట్ల మద్యం ముడుపులు చేరినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (ఐజీ ర్యాంక్) నేతృత్వంలో సిట్‌ను రంగంలోకి దించింది. తాడేపల్లి ప్యాలెస్‌కు మద్యం సొమ్ములు చేర్చడంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్రను సిట్ అధికారులు పసిగట్టారు. వీరిలో బాలాజీ వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ). ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని వి.కోట మండలం పీ.కొత్తూరు ఆయన గ్రామం. చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు ఆయన సోదరుడు. సీఏ చదివిన బాలాజీ కొంతకాలం బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి ఉద్యోగం చేశారు. హైదరాబాద్‌కు తిరిగివచ్చి 2009లో అప్పటి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి వద్ద చేరారు.
జగన్‌కు అత్యంత సన్నిహితునిగా..
విజయసాయి ద్వారానే జగన్ కుటుంబానికి చేరువయ్యారు. వైసీపీ ఆవిర్భావంతో విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో బాలాజీ పూర్తి స్థాయిలో భారతీ సిమెంట్స్‌తో పాటు జగన్, భారతి ఆర్థిక లావాదేవీలను దగ్గరుండి చక్కబెడుతూ, వారికి అత్యంత సన్నిహితునిగా మారారు. అనతికాలంలోనే భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఎదిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ మొదలు ముడుపుల వసూళ్ల వరకూ ప్రతి అడుగులోనూ బాలాజీ పాత్ర ఉంది. రాజ్ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయల మద్యం ముడుపులను ఊరు పేరు లేని షెల్ కంపెనీల్లోకి మళ్లించడంలో మాస్టర్ మైండ్ గోవిందప్పదేనని సిట్ ఆధారాలు సేకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...
చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు
For More AP News and Telugu News