Delhi Elections 2025: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:39 PM
ఢిల్లీ ఎన్నికల్లో విజయం అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ విజయోత్సవాన్ని పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేతలు హాజరయ్యారు.

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections 2025) ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదిగింది. ఢిల్లీ గడ్డపై భారీ మెజార్టీతో బీజేపీ (BJP) విజయం కేతనం ఎగరవేసింది. మెుత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ ఒడిసిపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ విజయోత్సవాన్ని పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేతలు హాజరయ్యారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని మిఠాయిలు తినిపించుకున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత దక్కిన విజయం కావడంతో గెలుపు నినాదాలతో హోరెత్తించారు.
ప్రధాని మోదీ కితాబు..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మెచ్చుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీలోని తెలుగువారున్న నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయడం ఎంతో కలిసి వచ్చిందని చెప్పారు. టీడీపీ ఎంపీలు, పార్టీ శ్రేణులతో ప్రచారం చేయించడం విజయానికి దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సుపరిపాలనతో చంద్రబాబు తన ట్రాక్ రికార్డ్ స్థాపించారని ప్రధాని కొనియాడారు. ఎక్కడైతే నాయకులు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారో అక్కడ మంచి ఫలితాలు వస్తాయని మోదీ చెప్పుకొచ్చారు.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ఉండడంతో ఏపీకి మరింత లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండి వ్యవసాయం చేయడం గగనంగా ఉండేదని చెప్పారు. కానీ నేడు అదే గుజరాత్ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తోందని తెలిపారు. ఒకప్పుడు బిహార్‌లో భయంకరమైన పరిస్థితులు రాజ్యమేలేవని, కానీ నితీశ్ కుమార్‌తో బీజేపీ జతకట్టాక పరిపాలన, అభివృద్ధిలో సమూల మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రజల జీవితాల్లో మార్పులు ఎన్డీయేతోనే సాధ్యమని, దేశం వికసిత్ భారత్ లక్ష్యాలను సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగాని కంటే ముందే ఢిల్లీ విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం చరిత్రాత్మకమని చంద్రబాబు కొనియాడారు. పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం అక్కడి ఎన్నికల్లో బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, త్వరలో ఆ రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పుకొచ్చారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని చంద్రబాబు సైతం మోదీకి కితాబు ఇచ్చారు. ఆయన స్థిరమైన పాలన, పాలసీలు గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయని, అలాగే దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..