Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:41 PM
మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహం గురువారం సాయంత్రానికి మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు.
అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. గురువారం బ్యారేజీకు 4.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉన్నతాధికారులు జారీ చేశారు. అయితే గురువారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద వరద నీరు మరింత వచ్చి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4 లక్షల 90 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కిందికి విడుదల చేశారు. మరో వైపు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణనదిలోకి వచ్చి చేరింది. ఇలా రెండు వైపుల నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది.
ఈ వరద నీటిని కిందికి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మొంథా తుపాన్ కారణంగా.. కృష్ణనది పరివాహక ప్రాంతంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి. ఆ జాబితాలో గ్రామాలు, పంట పొలాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీ నుంచి దిగువకు నీటికి విడుదల చేసేందుకు ఉన్నతాధికారులతో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇక బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.
పరిశీలించిన మంత్రి..
మరోవైపు కృష్ణా నదితోపాటు దాని ఉప నదులకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలోని వరద నీటి ప్రవాహాన్ని ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి అప్రమత్తం చేసి.. తగు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే
మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..
Read Latest AP News And Telugu News