Share News

NCW: జగన్ మీడియా అసభ్యకర వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:19 PM

NCW: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

NCW: జగన్ మీడియా అసభ్యకర వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం
NCW on Jagan media remarks

New Delhi: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) మహిళలపై (Womens) జగన్ మీడియా (Jagan media) జర్నలిస్టులు (Journalists) చేసిన అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ (DGP)కి జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.


ఎన్‌సీడబ్ల్యూ ఖండన..

ఈ అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా జాతీయ మహిళా కమిషన్ ఖండిస్తోందని ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది. మూడు రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.


అజ్ఞాతంలో కృష్ణంరాజు...

కాగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు మూడు రోజుల కిందటే విజయవాడలోని తన ఇంటికి తాళం వేసి కుటుంబంతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు జగన్ మీడియా తీరుపై ఏపీ వ్యాప్తంగా మహిళల నిరసనలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి.


జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్‌ చానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు, ఎనలిస్టు కృష్ణంరాజు మాత్రం ఇంటికి తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన కోసం పోలీసు బృందాలు పెద్దఎత్తున గాలిస్తున్నాయి. ఇటీవల జగన్‌ చానల్లో యాంకర్‌ కొమ్మినేని నిర్వహించిన లైవ్‌ డిబేట్లో.. అమరావతి దేవతల రాజధాని కాదు... వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొమ్మినేని ఆయనను వారించకుండా చర్చను కొనసాగించారు. దీనిపై రాజధాని ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నా.. ఆ ఇద్దరు గానీ, సాక్షి యాజమాన్యం గానీ కనీసం క్షమాపణలు చెప్పకపోవడంతో వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీకి వెళ్లి కొమ్మినేని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లో హాజరుపరిచి.. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సోమవారం రాత్రికి విజయవాడ తీసుకొచ్చారు. తొలుత రాజధానిలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు గానీ.. లేదంటే గుంటూరు గానీ తీసుకురావాలని భావించారు. అయితే ఈ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు ప్రతిఘటించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు విజయవాడలోనే ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచారు. రాత్రి పొద్దుపోయాక నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి:

కార్గో నౌకలో మంటలు.. 4గురు గల్లంతు..

తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు..?

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 10 , 2025 | 01:36 PM