Nara Lokesh : మహిళలను కించపర్చొద్దు... ఏదైనా ఆడవారి తర్వాతే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:59 PM
ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఆటోడ్రైవర్‌లు వాటిని జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తారని లోకేష్ చెప్పారు. అంతేకాకుండా.. ‘అప్పు చేసి కొన్నా ... నన్ను చూసి ఏడవద్దు’ అంటూ కొన్ని కామెడీ కొటేషన్లు కూడా ఆటోల వెనక రాస్తారన్నారు.
అమరావతి, అక్టోబర్ 4: ఆటో డ్రైవర్‌ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. డ్రైవర్‌గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్‌లు కూడా నటించారని గుర్తుచేశారు. ‘ఆటో వెనుక ఉన్న కొటేషన్లు నేను ఎప్పుడు చదువుతాను. వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పొద్దు... మొక్కనాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు... అందరూ బావుండాలి అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు’ అని మంత్రి వెల్లడించారు.
ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఆటోడ్రైవర్‌లు వాటిని జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తారని లోకేష్ చెప్పారు. అంతేకాకుండా.. ‘అప్పు చేసి కొన్నా ... నన్ను చూసి ఏడవద్దు’ అంటూ కొన్ని కామెడీ కొటేషన్లు కూడా ఆటోల వెనక రాస్తారన్నారు. యువగళం అప్పుడు ఆటో డ్రైవర్‌లతో ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ఆటో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి వారికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. గుంతలు లేకుండా చూడడం ద్వారా ఆటో ప్రమాదాలు నివారించామని మంత్రి తెలిపారు.
వైసీపీపై ఫైర్..
వైసీపీ హయాంలో కుడిచేత్తో రూ.10 వేలు ఇచ్చి ఎడమ చేత్తో రూ.20 వేలు గ్రీన్ టాక్స్ రూపంలో లాగేశారని మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడారని... దానిపై రోజా వద్దకు హమీద్ భాషా వెళ్లాలనుకున్నారని.. అయితే ఆయన ఆటోను పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. ఆయన్ను ఆదుకోవాలని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.
పేదవాడి కారు ఆటో... చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేది ఆటోలోనే బస్సు, రైలు ఎక్కాలన్నా ఆటోలు ఉండాల్సిందే అని తెలిపారు. కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలకు పూజ చేస్తారన్నారు. దసరా పండగ అయిన 3 రోజుల్లోనే ఆటో డ్రైవర్ల అకౌంట్‌లలో రూ.15 వేలు అందజేస్తున్నామన్నారు మంత్రి. సుమారు 3 లక్షల మందికి ఇస్తున్నామని.. మెరుగైన సర్వీసు అందజేయాలని.. అప్పుడే మంచి మార్కెట్ వస్తుందని సూచించారు.
‘ఆవకాయ పట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా.. ఆటో నడపాలన్నా ఆడవారి తరువాతే. మా అక్క స్వర్ణలత ఆటోను చాలా అద్భుతంగా తోలారు. భార్య, భర్త ఇద్దరూ ఆటోలు నడుపుతున్నారు. తల్లికి వందనం.. గ్యాస్ సిలెండర్.. అత్తకు పెన్షన్ వస్తుందని చెప్పారు. మహిళలను మనం కించపరచకూడదు... గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లలా ఏడవద్దు అనే మాటలు మనం వాడకూడదు. ఆటోలు ఎక్కేవారికి చెప్పండి మహిళలను గౌరవించండి అని. గత పాలకులు మీటింగ్‌కు రావడానికి పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేవారు. అయితే ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం కూడా మీ ముందు సామాన్యులుగా నిల్చుని ఉంటున్నారు. మనది డబల్ ఇంజన్ సర్కార్. అందుకే అన్ని పథకాలు నడపగలుగుతున్నాం’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు..
దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం..
Read Latest AP News And Telugu News