Nara Lokesh: నిర్మలా సీతారామన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి: మంత్రి లోకేష్
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:02 PM
స్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నిది కేంద్రమంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు.
అమరావతి, నవంబర్ 28: అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదని.. పవర్ ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ (Minister Lokesh) అన్నారు. శుక్రవారం నాడు రాజధానిలో బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం, పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని విమర్శించారు. మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క వ్యక్తి కోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని మంత్రి గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అని అన్నారు. మంగళగిరి చేనేత వస్త్రాలు ధరించి ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. స్త్రీ శక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది నిర్మలాను చూసి ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. ఏపీ ఏ సాయం కోరినా ఆర్థిక మంత్రి సహకారం అందిస్తున్నారన్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా ఆదుకున్నారన్నారు.
భారత్‌లో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖకు వస్తోందని.. దీనికి నిర్మలా సీతారామన్ అండగా నిలిచారని తెలిపారు. 15 బ్యాంకులు, బీమా కంపెనీలు రూ.1334 కోట్లతో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. అన్ని బ్యాంక్ సర్వీసులు ఒకే చోట ఉండేలా బ్యాంకు స్ట్రీట్ ఏర్పాటవుతోందన్నారు. రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయని వెల్లడించారు. అమరావతి రైతుల ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ కృషి చేస్తోందన్నారు. గత 5 ఏళ్ల విధ్వంసం దృష్టిలో పెట్టుకుని రైతులు ఐకమత్యంగా అమరావతి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి లోకేష్ కోరారు.
రైతుల కోసం నిలబడతాం: డిప్యూటీ సీఎం పవన్

కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతీ అభివృద్ధి ప్రజల కళ్ళకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే బ్యాంక్ స్ట్రీట్.. ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుందని తెలిపారు. ఆర్థిక కేంద్రంతో పాటు విద్య, పరిశోధన కేంద్రంగా అమరావతి ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి వేసే ప్రతీ అడుగులో కేంద్ర తోడ్పాటు ఉంటోందన్నారు. బలమైన నాయకత్వం, అనుభవంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రం కోసం నిలబడ్డ అమరావతి రైతుల కోసం తాము నిలబడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వింత సంప్రదాయం.. వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబు
ఒకరు ఎనిమిదో తరగతి.. మరొకరు తొమ్మిదో తరగతి.. విజయవాడ టు హైదరాబాద్..
Read Latest AP News And Telugu News