Lokesh Challenge: మండలిలో బొత్సకు మంత్రి లోకేష్ సవాల్
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:32 PM
Lokesh Challenge: వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ శాసనమండలిలో వీసీల రాజీనామా అంశం తీవ్ర రచ్చకు దారి తీసింది.
అమరావతి, మార్చి 4: ఏపీ శాసనమండలి సమావేశాల్లో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వీసీల రాజీనామా అంశంపై మండలిలో రగడ చోటు చేసుకుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లను బెదిరించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (MLC Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు మంత్రి లోకేష్ (Minister lokesh). వైస్ ఛాన్సలర్‌లు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను లోకేష్ సభలో చూపించారు. బెదిరించినట్టు లేఖల్లో ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్ల రాజీనామా చేశారని.. ఆ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు.
అంతకుముందు రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ల విషయంపై కూడా విచారణ జరపాలని బొత్స కోరారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేశారని ప్రశ్నిస్తూ... మీరు దీనిపై విచారణకు ఆదేశించాలని మండలిలో ఎమ్మెల్సీ కోరారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రికార్డులు తీయాలని.. ఆ రికార్డ్‌లో టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్టు వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు. వెంటనే తాము ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్‌ను ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. ‘‘బెదిరించి రాజీనామా చేయించారని మీ సభ్యులు ఆ రోజు అన్నారా? లేదా? అనేది చెప్పమనండి. బెదిరించలేదని నేను ఆధారాలు చూపించాను. అందువలనే ప్రివిలేజ్ మోషన్‌ను నేను మూవ్ చేస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు.
India vs Australia: హెడ్ కోసం మాస్టర్ స్కెచ్.. ఆకలితో ఉన్న సింహాన్ని మరింత రెచ్చగొడుతున్నారు
ఇంగ్లీష్‌లో త్రెటెన్ అనే పదం ఉందా చూపించాలంటూ మండలిలో మంత్రి సవాల్ చేశారు. రాజారెడ్డి చెల్లెలు వైసీపీ నేత, ప్రసాద రెడ్డి వైసీపీ కార్యకర్త.... వీళ్లా వైస్ ఛాన్సలర్‌లు అని ప్రశ్నించారు. దమ్ముంటే వైస్ ఛాన్సలర్‌లు చేసిన రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఎక్కడైనా ఉందా నిరూపించాలన్నారు. వైసీపీ నేత బొత్స తమ సభ్యులను లేచి నుంచొని నిరసన చెప్పాలని కోరుతున్నారని ఈ సందర్భంగా లోకేష్ ఆరోపించారు. దీంతో టీడీపీ, వైసీపీ సభ్యులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో పరిస్థితి అదుపు తప్పడంతో సభను చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు.
సభ వాయిదా...
అయితే బ్రేక్ తరువాత శాసనమండలి ప్రారంభమవగా.. వెంటనే వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. వీసీలను బెదిరించిన వ్యవహారంపై విచారణ జరుపాలని నినాదాలు చేశారు. వెల్‌లోకి వెళ్లి మరీ నినాదాలు చేశారు. విచారణపై మంత్రి సమాధానం చెప్పాలని.. ప్రభుత్వం తరపున మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ కోరారు. అయినా నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభను ఆర్డర్‌లో పెట్టాలని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి కోరారు. వైసీపీ సభ్యులు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. వైసీపీ సభ్యుల నినాదాలు కొనసాగడంతో మండలి చైర్మన్ సభను రేపటి(బుధవారం)కి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత
Read Latest AP News And Telugu News