గ్రేటర్ అటెన్షన్..!
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:42 AM
గ్రేటర్ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
నేడు సీఎం అధ్యక్షతన గ్రేటర్ విజయవాడపై కీలక సమావేశం
పంచాయతీల తీర్మానాలను కోరుతున్న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ
గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆర్డినెన్స్ జీవో ఇవ్వాలన్న డిమాండ్
డిసెంబరు 31 దాటితే నిర్ణయాలు తీసుకోవడం కష్టం
ఏ నిర్ణయానికైనా ఈ నాలుగైదు రోజులే సమయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రేటర్ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. డిసెంబరు 31లోపు ప్రభుత్వం జీవో ఇవ్వగలిగితే.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ సమయంలో ఇచ్చిన జీవోలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడలో కొండపల్లి, తాడిగడప మునిసిపాలిటీలను పక్కన పెడితే.. మిగిలినవన్నీ పంచాయితీలే. కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ దారిలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంపు విషయంలో తెలంగాణా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన జీవో ఎంఎస్ నెంబర్ 264ను జారీ చేసిన అంశాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెరపైకి తెస్తున్నారు. ఈ అంశం గురించి కలెక్టర్ లక్ష్మీశతో ఆయన చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంపునకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, తర్వాత ఇచ్చిన ప్రొసీడింగ్స్, డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ఆదేశాలను అధ్యయనం చేస్తున్నారు. పంచాయతీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వటానికి ఉన్న అవకాశాలపై జిల్లా పంచాయతీ అధికారి, రాష్ట్ర పంచాయతీ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో ఏడాదిలో గ్రేటర్ విజయవాడ కల సాకారమవుతుంది. లేదంటే కాలాతీతమయ్యే అవకాశం ఉంది.
పంచాయతీల తీర్మానాలను కోరిన ఎంఏయూడీ
గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనల నేపథ్యంలో శుక్రవారం ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ పంచాయతీల తీర్మానాలను కోరారు. గతంలోనే 45 పంచాయతీల తీర్మానాలను తీసుకున్నారు. కొత్తగా మరో 30 పంచాయతీలు ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తీర్మానాలను తీసుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదు. ప్రస్తుతం చాలావరకు పంచాయతీ పాలకవర్గాలు వైసీపీకి చెందినవే. తీర్మానాలను ఇవ్వకపోవచ్చు. కాలాతీతం చేయొచ్చు. అలాగే, జనవరి 1 నుంచి జనగణన మొదలవుతుంది. ఆ సమయానికి కూడా ఇబ్బంది అవుతుంది. మార్చి తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా అప్పుడేం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యాక గ్రేటర్ చేస్తామంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇవన్నీ గ్రేటర్ విజయవాడకు ప్రతిబంధకాలే.
ఆర్డినెన్స్‌పై ఆశలు
విలీన పంచాయతీల నుంచి మళ్లీ తీర్మానాలు తీసుకోవాలంటే డిసెంబరు 31 వరకు మాత్రమే సమయం ఉంది. ఈ నాలుగైదు రోజుల్లో ఆ పని పూర్తికాదు. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ జీవో ఇవ్వగలిగితే గ్రేటర్‌కు మార్గం సుగమం అవుతుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ ప్రతిపాదిత పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించవచ్చు. స్పెషల్ ఆఫీసర్లతో తీర్మానాలు తేలిగ్గా చేయించవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.