SIT Chargesheet in Liquor Scam: జోగి రమేష్ అండతోనే నకిలీ మద్యం దందా.. ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:19 PM
విజయవాడ నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎనిమిది మంది నిందితులపై ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు నిందితుల పాత్రను ఛార్జిషీట్ లో సిట్ అధికారులు వివరించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఛార్జిషీట్ దాఖలు చేసింది. మెుత్తం 8 మంది నిందితులపై ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అండతోనే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం దందా మొదలుపెట్టారని ఛార్జిషీట్ లో సిట్ పేర్కొంది. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతోందని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా జనార్దన్ రావుతో ములకలచెరువులో జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని తెలిపింది. ఈ కేసులో 8 మంది నిందితుల పాత్రను సిట్ అధికారులు వివరించారు.
నకిలీ మద్యం తయారీకి సంబంధించి ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు (A1), ఆయన సోదరుడు జగన్ మోహన్ రావు(A2) కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. నిందితులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిట్ వివరించింది. ఛార్జిషీట్ ప్రకారం.. జనార్దనరావు, జగన్ మోహన్ రావులు జోగి రమేష్, జోగి రాములకు రెండు మూడు నెలలకొకసారి రూ. 3-5 లక్షలు పంపించేవారని, కొన్నిసార్లు జనార్దనరావు నేరుగా నగదు చెల్లించారని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
2006–2019 మధ్య జోగి రమేష్, జనార్దనరావులకు వ్యక్తిగత పరిచయాలు ఉండేవని సిట్ పేర్కొంది. రమేష్, రాము స్వర్ణ బార్‌లో భాగస్వాములుగా ఉన్నారని, 2019లో దాని పేరు చెర్రీస్ బార్‌గా మార్చారని తెలిపారు. 2017లో ఇబ్రహీంపట్నం బార్ల సిండికేట్‌లో రమేష్, రాములు కీలక పాత్ర పోషించారని అధికారులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
SIT దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో నిందితుల పాత్రలు:
అద్దేపల్లి జనార్దనరావు (A1)
జగన్మోహన్‌రావు (A2)
ఎన్. రవి (A4)
బాదల్ దాస్ (A7)
ప్రదీప్ దాస్ (A8)
శ్రీనివాసరెడ్డి (A11)
కళ్యాణ్ (A12)
తిరుమలశెట్టి శ్రీనివాసరావు (A13)
Also Read:
సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది?
ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ తొలగింపు?..