IndiGo CEO Pieter Elbers: ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ తొలగింపు?..
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:24 PM
ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది. కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది.
ఇండిగో సంక్షోభం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. 5 రోజుల్లో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా నిత్యం కొన్ని వందల మంది ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు సర్వీసులు రద్దయి ఇబ్బందులు పడుతున్న ప్రయాణీలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇండిగోతో పాటు మిగిలిన విమాన సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నాయి. డొమస్టిక్ సర్వీసులకు ఇంటర్ నేషనల్ సర్వీసులతో సమానంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది.
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తొలగింపు?..
పౌర విమానయాన శాఖ ఇండిగోకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది. అన్ని విమానాల రీఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి 8:00 గంటలలోపు పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ నియంత్రణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అంతేకాదు.. టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని ఇండిగోతో పాటు మిగిలిన విమాన సంస్థలను విమానయాన శాఖ హెచ్చరించింది.
ఇండిగో సంక్షోభానికి సీఈఓ వైఫల్యమే కారణమని కేంద్రం భావిస్తోంది. చర్యల్లో భాగంగా కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ పీటర్ ఎల్బర్స్‌కు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని సమాచారం. అంతేకాదు.. ఇండిగో కంపెనీపై కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో పెనాల్టీలు విధించడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
డయాబెటిస్ వారికి ఈ మొక్క దివ్వ ఔషధం.!
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్