Anitha Flood Meeting: వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ఆరా
ABN , Publish Date - Oct 03 , 2025 | 04:12 PM
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు.
అమరావతి, అక్టోబర్ 3: భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగిన నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalalpudi Anitha) ఈరోజు (శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత వరద పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని... ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు.
వంశధార, నాగావళి నది లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని ఆదేశించారు. విపత్తుల సమాచారం, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. విపత్తుల సంస్థ హెచ్చరిక సందేశం వచ్చినప్పుడు ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచనలు చేశారు.
మరోవైపు వంశధార నది పరివాహక ప్రాంతంలో దిగువున ఉన్న గ్రామ ప్రజలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రకటించారు. వంశధార నదికి గొట్ట బ్యారేజ్ వద్ద దిగువకు 1,04,891 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష
మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ
Read Latest AP News And Telugu News