Share News

Uttarandhra Floods: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ABN , Publish Date - Oct 03 , 2025 | 03:09 PM

గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ తెలియజేశారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు.

Uttarandhra Floods: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Uttarandhra Floods

అమరావతి, అక్టోబర్ 3: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని సీఎంకు అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ తెలియజేశారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని వివరించారు.


కాగా, భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతిచెందినట్లు సమీక్షలో చంద్రబాబుకు అధికారులు తెలిపారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని... ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని తెలిపారు.


భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని.. ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రంలోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 04:09 PM