Ganja Batch Attack: గంజాయ్ బ్యాచ్ ఎంతలా రెచ్చిపోయిందో చూడండి
ABN , Publish Date - May 15 , 2025 | 02:14 PM
Ganja Batch Attack: విజయవాడలో గంజాయ్ బ్యాచ్ రెచ్చిపోయింది. బస్టాండ్‌లో ప్రాంగణంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై పిడిగుద్దులు గుద్ది పారిపోయింది గంజాయ్ బ్యాచ్.
ఎన్టీఆర్ జిల్లా, మే 15: విజయవాడ బస్టాండ్‌లో గంజాయి బ్యాచ్ (Ganja Batch Attack) ఘాతుకానికి తెగబడింది. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణారావుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈరోజు (గురువారం) ఉదయం శ్రీశైలం నుంచి విజయవాడ విద్యుత్ సౌదాకు విధి నిర్వహణపై వచ్చిన కృష్ణారావుపై గంజాయి బ్యాచ్ పిడిగుద్దులతో దాడి చేసి పారిపోయారు. వీరి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న కృష్ణారావు అక్కడి నుంచి బస్టాండ్‌లోకి పరుగులు తీశారు. అనంతరం కొండపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కృష్ణారావు బస్ దిగి వస్తుండగా సిటీ బస్ టెర్మినల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దాడి చేసిన వారు ఎవరో తనకు తెలియదని, నగదు, వస్తువులు ఏవీ అడగలేదని కేవలం దాడి చేసి పారిపోయారని చెప్పారు.
నన్ను చంపబోయారు: కృష్ణారావు
‘బస్టాండ్ నుంచి ఆటో కోసం వచ్చాను. వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను బాగా కొట్టారు. చంపేయబోయారు. వాళ్లు ఎవరో నాకు తెలీదు. ఎందుకు కొట్టారో కూడా తెలియదు. డబ్బులు ఏమీ అడగలేదు. సైలెంట్‌గా వచ్చి బాగా కొట్టి వెళ్లిపోయారు. వాళ్లు బాగా మత్తులో ఉన్నట్టున్నారు. మొహంపై దెబ్బలు తగిలాయి. గుండెలపై తన్నారు. వారిని నుంచి తప్పించుకుని పారిపోయారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరు’ అని బాధితుడు కృష్ణారావు చెప్పుకొచ్చారు.
గతంలో విజయవాడలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు విపరీతంగా ఉండేవి. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వచ్చాక కూటమి ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్ ఆగడాలపై దృష్టి పెట్టారు. డ్రోన్ల ద్వారా వారి స్థావరాలను గుర్తించి వారందరినీ అరెస్ట్ చేయడంతో పాటు.. అమాయకులను గుర్తించి వారిని కౌన్సిలింగ్‌కు పంపించారు. అయితే బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్ వద్దే తిరుగుతూ ఒంటరిగా కనిపించిన వారిపై దాడి చేసి డబ్బులు, నగదును లాక్కోవడం గంజాయి బ్యాచ్‌కు పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న (బుధవారం) శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు, మరో మిత్రుడితో కలిసి విజయవాడ బస్టాండ్‌లో దిగారు. ఆ తరువాత కృష్ణారావు ఒక్కరే బయటకు రావడం గమనించిన గంజాయి బ్యాచ్.. సిటీ బస్ టెర్మినల్ దగ్గర రెండు బస్సుల మధ్యలోకి లాక్కెళ్లి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
మొహంపై పిడిగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. అసలు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా అర్ధంకాక భయాందోళనకు గురయ్యారు కృష్ణారావు. తన దగ్గరున్నవి ఇచ్చేస్తానని బతిమిలాడినప్పటికీ వారు వినిపించుకోలేదు. కృష్ణారావుపై దాడి చేసి డబ్బులు, వస్తువులు తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో గంజాయి బ్యాచ్‌తో ఎవరైనా ఉద్దేశపూర్వంగా దాడి చేశారా లేక వారు గంజాయి మత్తులో ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దాడి చేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే దాడి జరిగిన వెంటనే కృష్ణారావు తన నివాసానికి వెళ్లిపోయి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
Read Latest AP News And Telugu News