Share News

Krishna: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 09:40 AM

కృష్ణా జిల్లా: గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సత్తిబాబు.. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.7.80 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లించాడు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో జనవరి నెల చెల్లించలేదు.

Krishna: ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..
Finance Company Harassment

కృష్ణా జిల్లా: ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడివాడ మండలం మోటూరులో చోటు చేసుకుంది. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక జనవరి నెలకు సంబంధించిన వాయిదా చెల్లించలేకపోయాడు. 25వ తేదీ వచ్చినా నగదు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు సత్తిబాబు ఇంటికి వెళ్లారు. తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, అందుకే డబ్బులు చెల్లించడం ఆలస్యమైందని చెప్పాడు.


సత్తిబాబు మాటలు వినని సదరు సంస్థ సిబ్బంది గొడవకు దిగారు. డబ్బులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేశారు. సత్తిబాబు తన ఇంటిని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో ఈనెల 28న ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అంతటితో ఆగకుండా ఆటో స్టాండ్‌ వద్దకు వెళ్లి నానా రభస చేసి అతని పరువు పోయేలా ప్రవర్తించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి విస్తార్ కంపెనీ ప్రతినిధిలే కారణమని, వారు వేధింపులకు పాల్పడడంతోనే తాను బలవన్మరణానికి పాల్పతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సూసైడ్ నోట్‌ను ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఈనెల 28న సాయంత్రం విస్తార్ కంపెనీ ప్రతినిధులు తమ ఇంటికి వచ్చారని, రాత్రి 10:30 వరకూ గొడవ చేశారని సత్తిబాబు భార్య పద్మావతి తెలిపారు. తన భర్త ఇంట్లో లేరని, రాగానే ఫోన్ చేయిస్తానని చెప్పినా వినకుండా ఇంటికి తాళాలు వేస్తామంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తిబాబు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భర్త మృతితో ఇద్దరు పిల్లలతో సహా తాను రోడ్డున పడ్డానని బాధితురాలు పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 31 , 2025 | 09:42 AM