Fake TTD Letters: నకిలీ టీటీడీ లేఖలు.. పోలీసులకు మంత్రి పీఏ ఫిర్యాదు
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:05 PM
తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజులకే మళ్లీ ఈ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్ గా ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నారు.
విజయవాడ, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లేఖలు చలామణి కావడం కలకలం సృష్టించింది. దీంతో మంత్రి సత్య కుమార్ పీఏ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల పలువురు భక్తులు మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న టీటీడీ లేఖలను దళారుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం వాటితో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ లేఖలు నకిలీవని వారికి టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తాము మోసపోయామంటూ ఈ వ్యవహారాన్ని మంత్రి సత్యకుమార్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.
కొన్ని రోజులుగా మంత్రి పేరుతో నకిలీ టీటీడీ లేఖలు జారీ అవుతున్నట్లు మంత్రి కార్యాలయం గుర్తించింది. దాంతో విజయవాడ నగర సీపీకి మంత్రి సత్యకుమార్ పీఏ ఫిర్యాదు చేశారు. మంత్రి పేరుతో టీటీడీ నకిలీ లేఖలు జారీపై దర్యాప్తు చేపట్టాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును సత్యకుమార్ పీఏ కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.
మరోవైపు.. తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజులకే మళ్లీ ఈ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్ గా ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నారు. అందుకు భారీ మొత్తంలో నగదు దండుకుంటున్నారు. తీరా స్వామివారి దర్శనానికి వెళ్లితే.. ఇవి నకిలీ లేఖలంటూ టీటీడీ అధికారులు చెబుతూ వెనక్కి పంపిస్తున్నారు. దాంతో తాము మోసపోయామంటూ భక్తులు బాధితులుగా మారి.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిజిటల్ అరెస్ట్ నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు: సీపీ
విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన
For More AP News And Telugu News