Durga Gudi Chairman: దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటా..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:05 PM
తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవ చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు.
విజయవాడ, అక్టోబర్ 11: దుర్గగుడి పాలక మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు (శనివారం) జరిగింది. రాజగోపురం ముందు ఈవో సినానాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు అయ్యింది. ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గగుడి ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ.. ఈ రోజు గొప్పగా ప్రమాణ స్వీకారం జరగటం సంతోషంగా ఉందన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.
ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవ చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. దసరా వేడుకలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగాయన్నారు. సుమారు 20 లక్షల మంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు నిర్వహించటం సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి నేతలతో ఏర్పాటైన పాలక మండలి అందరం ఏక మాట మీద ఉండి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్న తనుకు తెలియజేయాలని.. పరిష్కారం చేస్తానని దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు.
అందరం కలిసి పనిచేస్తాం: ఈవో
అమ్మవారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం జరిగిందని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఉద్యోగులతో కలిసి పాలక మండలి అందరం కలిసి పని చేస్తామన్నారు. ఇంద్రకీలాద్రిపై చిన్న స్థలం కావటంతో కిందనే కొన్ని కార్యాలయాలు మార్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. వృద్ధులకు పెద్ద పీట వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వద్ద నుంచి ఆలయానికి తీసుకు వచ్చే విధంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కనకదుర్గ నగర్, దుర్గ ఘాట్‌లో బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఓం టర్నింగ్ దగ్గర నుంచి బ్యాటరీ వెహికల్స్‌లో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని.. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తామని ఈవో శీనా నాయక్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
Read Latest AP News And Telugu News