Amaravati: నేరస్థులకు చుక్కలు చూపిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ డ్రోన్స్..
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:55 PM
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహాయంతో పేకాట ఆడేవారిని నగర పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి నిందితులు రహస్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దింపారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన కొత్తపుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. ఇందుకు అనుగుణంగా అమరావతి, విశాఖ, తిరుపతిలో మూడు నాలెడ్జ్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూడు సిటీల్లో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, ఐదు ప్రపంచస్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు జనవరి 30న వాట్సాప్ గవర్నెన్స్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా 520 రకాల పౌర సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఏపీ ప్రజలకు నేరస్థుల నుంచి రక్షణ కల్పించేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దింపారు.
ఏపీ పోలీసులు టెక్నాలజీ వాడుకునేలా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ సిటీ పోలీసులకు డ్రోన్లు అందించింది. దీంతో నిందితులను ఎక్కడున్నా పట్టుకోవడం వారికి సులభంగా మారిపోయింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కమిషనరేట్ వ్యాప్తంగా డ్రోన్స్ అందించింది కూటమి ప్రభుత్వం. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించే వ్యక్తులను, పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్ చేసే వారినీ శిక్షించేందుకు మార్గం సుగుమం అయ్యింది. అలాగే పేకాట, కోడి పందేలు వంటి అసాంఘిక కార్యక్రమాలను సత్వరమే అడ్డుకునేందుకు అవకాశం దొరికింది.
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహాయంతో పేకాట ఆడేవారిని నగర పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి నిందితులు రహస్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దింపారు. విజయవాడ పటమటలోని నిర్మానుష్య ప్రాంతాలపై వాటిని ఎగవేశారు. రహస్య ప్రదేశం ఏర్పాటు చేసుకుని పదుల సంఖ్యలో జూదగాళ్లు పేకాట ఆడటాన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. అలాగే గంజాయి సేవిస్తున్న వారినీ గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆధునిక సాంకేతికత సహాయంతో నేరస్థులను పట్టుకున్న సిబ్బందిని సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, నగర వాసులు అభినందిస్తున్నారు. కాగా, నేరస్థులను పట్టుకున్న వీడియోలను విజయవాడ సిటీ పోలీస్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
Read Latest AP News And Telugu News