Cyclone Montha IAS Amrapali: రంగంలోకి ఆమ్రపాలి.. అధికారుల పరుగులే పరుగులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:21 PM
మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమెకు జాయింట్ కలెక్టర్ నవీన్ వివరించారు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 27: మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నారు. తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన మంత్రులు, అధికారులు.. ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి.. వెంటనే రంగంలోకి దిగారు. ఆమ్రపాలి రాకతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లాకు వచ్చిన మరుక్షణమే ఫీల్డ్ విజిట్‌తో అధికారులను పరుగులు పెట్టించారు ఆమ్రపాలి.
మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమ్రపాలికి జాయింట్ కలెక్టర్ నవీన్ వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆర్డర్స్ పాస్ చేశారు.
ఇక మంగినపూడి బీచ్ లోకి ఎవ్వరినీ వెళ్లనీయవద్దని స్పెషల్ ఆఫీసర్ ఆదేశించారు. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ను ఆమ్రపాలి సందర్శించారు. బీచ్ వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్‌లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. పోలీస్, మెరైన్ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ప్రత్యేక అధికారి ఆమ్రపాలి ఆదేశించారు.
కాగా.. మొంథా తుపాన్ ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం.. ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గే వరకు రిలీఫ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని స్పెషల్ ఆఫీసర్స్‌ను సర్కార్ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురుగాలులతో వర్షాలు స్టార్ట్
మొంథా తుఫాన్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
Read latest AP News And Telugu News