Share News

Andhra Weather News: 12 గంటల్లోపు వాయుగుండం.. హోంమంత్రి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:48 PM

సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Andhra Weather News: 12 గంటల్లోపు వాయుగుండం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
Andhra Weather News

అమరావతి, అక్టోబర్ 22: బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత (Home Minister Anitha) ఈరోజు (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు.


సహయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని అధికారులకు తెలియజేశారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత వినతి చేశారు.


అధికారులు సిద్ధంగా ఉండండి: మంత్రి అనగాని

మరోవైపు.. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులను రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ వాగులు పొంగుతాయో అక్కడి ప్రజలను హెచ్చరించాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు విరిగిపడే చోట ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 03:12 PM