Anagani Satyaprasad Accuses Jagan: జగన్.. వైసీపీ బ్యాచ్‌పై విరుచుకుపడ్డ మంత్రి అనగాని
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:53 AM
కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వారి కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసింది నిజం కాదా అని మంత్రి అనగాని నిలదీశారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు జగన్ రెడ్డి బినామీలు కాదా అని అడిగారు.
అమరావతి, అక్టోబర్ 23: కల్తీ మద్యం తయారీకి ఆద్యులు జగన్ రెడ్డి, అతని పార్టీ నేతలు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వారి కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసింది నిజం కాదా అని నిలదీశారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు జగన్ రెడ్డి బినామీలు కాదా అని మంత్రి అడిగారు.
‘వైసీసీ నేత మల్లాది విష్ణు బార్‌లో నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోతే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు జగన్ రెడ్డి? సర్వేపల్లి, కావలి వైసీపీ నేతలు కాకాణి గోవర్దన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిలపైన నకిలీ మద్యం కేసులు ఉన్నది వాస్తవం కాదా? వీరిద్దరినీ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్ రెడ్డి?’ అని విమర్శించారు. కానీ నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులను టీడీపీ నుండి సస్పెండ్ చేశామని... వారిపై కేసులు పెట్టామన్నారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు.
జగన్ పాలనలో జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 27 మంది ప్రాణాలు పోతే కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదని మండిపడ్డారు. విచారణ జరపకుండా కేసును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. కానీ తాము ఏలూరులో ఒకరు చనిపోతే విచారణ చేయించామని.. పోస్ట్ మార్టం చేయించామని తెలిపారు. వైసీపీ బ్యాచ్ మాత్రం ఎవరు ఎక్కడ చనిపోయినా కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు యాచకులు చనిపోయినా కూటమి ప్రభుత్వానిదే తప్పు అంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News