Yoga: ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా..
ABN , Publish Date - May 29 , 2025 | 09:23 AM
Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పిలుపిచ్చారు. మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
Yoga: నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్‌లో ఐదు వేల మంది (5 Thousand Participants)తో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ (NTR Police Commissionerate) ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం (Yog Andhra Program) జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ (CS K. Vijayanand), ఐఎయస్ అధికారులు (IAS Officers) కృష్ణబాబు, మీనా, వీర పాండ్యన్, కలెక్టర్ లక్ష్మీశా, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నెల రోజుల పాటు యోగాంధ్ర..

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ.. మే 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని పిలుపిచ్చారు. మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను చేపట్టిందన్నారు. 45 నిమిషాల ఆసనాలతో అనారోగ్యాలు దరి చేరకుండా చూడవచ్చునని, ఎటువంటి ఒత్తిడిని అయినా తట్టుకుని నిలబడేలా యోగా సహకరిస్తుందని సీఎస్ విజయానంద్ అన్నారు.
Also Read: జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..
యోగాంధ్రలో భాగస్వామ్యం కావాలి..
అన్ని వర్గాల ప్రజలు ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం కావాలని, జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొంటారని సీఎస్ విజయానంద్ తెలిపారు. ప్రతి జిల్లాలో నెల రోజుల పాటు యోగాంధ్ర నిర్వహిస్తున్నారని, వేలాది మంది ప్రజలు ఆయా జిల్లాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారి కృష్ణబాబు దీనికి సంబంధించిన కార్యక్రమం డిజైన్ చేశారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్‌ల ఆధ్వర్యంలో ఇక్కడ యోగాంధ్ర బాగా జరుగుతోందన్నారు. ప్రజలు కూడా యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని, జీవితంలో యోగాను ఒక భాగం చేసుకుంటే.. ఆరోగ్యం, ఆనందం మీ వెంటే ఉంటుందని సీఎస్ విజయానంద్ అన్నారు.
సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ..

యోగాంధ్రలో గురువారం పోలీసు కుటుంబం భాగస్వామ్యం అయ్యిందని, గత పది రోజులుగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరుగుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఐదు వేల మందితో ఈరోజు యోగాంధ్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు యోగాంధ్రకు తరలి వస్తున్నారని, ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ యోగాంధ్ర నిర్వహిస్తున్నారని, చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఇవాళ యోగాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పోలీసు పరంగా యోగాంధ్రకు ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తామని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, ఆనందం, ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ..ఆంధ్రప్రదేశ్‌ను యోగాంధ్రగా మార్చేందుకు చేస్తున్న కృషికి ప్రజలు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేలా సహకరించిన వారందరికీ సీపీ రాజశేఖర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు...
For More AP News and Telugu News